Tuesday, 3 November 2026

పోలీసు పగ్గాలు రాష్ట్రం చేతిలో ఉండాల్సిందే

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) :
ఢిల్లీ పోలీసులపై నియంత్రణ అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండేను కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సహకరించడం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండేను కలిసి కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన షిండేతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని, ఢిల్లీ పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకపోవడంతో వారు నేరాల నియంత్రణలో జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని షిండే దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తే నగరంలో జరిగే ప్రతి నేరానికి వారు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోగలమని వివరించారు. షిండేతో భేటీ అనంతరం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ, అవసరమనుకుంటే ఎన్‌డీఎంసీ ప్రాంతం, లూటియన్స్‌ జోన్‌లను కేంద్ర పరిధిలో ఉంచుకుని మిగిలిన నగర శాంతి భద్రతల పర్యవేక్షణాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని షిండేను కోరామన్నారు. నగరంలో డెన్మార్క్‌ మహిళపై సామూహిక అత్యాచారం, మాలవీయనగర్‌లో డ్రగ్‌ రాకెట్‌పై దాడులు, పశ్చిమ ఢిల్లీలో మహిళ అనుమానాస్పద మృతి కేసులకు సంబంధించి నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశామన్నారు. ఆ డిమాండ్ల సాధ్యాసాధ్యలపై పరిశీలించి త్వరలోనే సమాచారమిస్తామని షిండే హామీ ఇచ్చారన్నారు. కేజ్రీవాల్‌ వెంట మంత్రులు మనీశ్‌ సిసోడియా, సోమ్‌నాథ్‌ భారతి, రాఖృ బిర్లా ఉన్నారు. అంతకుముందుకు లైంగిక వేధింపులకు పాల్పడిన వారు, డ్రగ్‌ మాఫియాపై చర్యలు తీసుకోని అధికారులను సస్పెండ్‌ చేయబోమని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సస్పెండ్‌ చేయాలన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వ డిమాండ్‌ ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. పోలీసుల ప్రవర్తనకు విచారణకు ఆదేశించడంతో పాటు వారిని సస్పెండ్‌ చేయాలని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ను కోరారు. వారిని సస్పెండ్‌ చేయాల్సిందేనని లేనిపక్షంలో విచారణకు ఆటంకాలు సృష్టిస్తారని సిసోడియా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తమ ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల ఆగడాలను చూస్తూ ఊరుకోబోదని, తమది షీలా దీక్షిత్‌ ప్రభుత్వం కాదన్న విషయాన్ని, ప్రభుత్వం మారిన విషయాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తిస్తే మంచిదని ఆయన అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఢిల్లీ పోలీసులను సస్పెండ్‌ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈమేరకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జంగ్‌ను కలిసి కోరారు. అయితే తాము ఎవరినీ సస్పెండ్‌ చేయబోమని గవర్నర్‌ ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు తేల్చిచెప్పారు. దీనిపై ఢిల్లీ నగర పోలీస్‌ కమిషనర్‌ బీఎస్‌ బస్పీ స్పందిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎవరిని సస్పెండ్‌ చేసినా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గవర్నర్‌, సీపీ వ్యవహార శైలిపై కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *