న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) :
సబ్సిడీ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 12కు పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఏఐసీసీ వేదిక మీదే ఆయన ఈ ప్రకటన చేశారు. రాయితీ సిలిండర్లు పెంచాలన్న రాహుల్ అభ్యర్థనను కేంద్రమంత్రి వెంటనే అంగీకరించారు. ఇది భారమైనా ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి 12కు పెంచిన నేపథ్యంలో ప్రభుత్వంపై పడే సబ్సిడీ భారం రూ.3,300 కోట్ల నుంచి రూ.5,800 కోట్లకు పెరుగుతుందని చమురు కంపెనీలు తెలిపాయి. ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్లపై భరిస్తోన్న భారాన్ని తగ్గించుకునేందుకు 2012 సెప్టెంబర్‌లో కోటాను ఆరుకు తగ్గించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో 2013 జనవరిలో కోటాను తొమ్మిదికి పెంచారు. ఇకపై ఏడాదిలో 12 సిలిండర్ల కోటాను పూర్తిగా వాడుకున్న వినియోగదారులు రూ.1,258 చెల్లించి మార్కెట్ ధరకు 14 కేజీల సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇక ఏడాదికి 12 సిలిండర్లు




