సమైక్యం కోసం కాదు
వక్రీకరించిన శైలజానాథ్‌కు గడ్డిపెట్టిన ఈటెల
హైదరాబాద్, జనవరి 17 (జనంసాక్షి) :
తెలంగాణ సాయుధ పోరాటం అప్పటి బూర్జువా దోపిడీకి వ్యతిరేకంగా సాగిందని.. సమైక్యాంధ్రప్రదేశ్ కాదని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ రాష్ట్ర మంత్రి సాకె శైలజానాథ్‌కు గడ్డిపెట్టారు. శైలజనాథ్ ప్రసంగిస్తూ చరిత్రను వక్రీకరించబోగా ఈటెల లేచి ఆయన అభ్యంతరం చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటం.. తెలంగాణ-ఆంధ్రను కలపటానికి చేయలేదని… నిజాం నుంచి విముక్తి కోసం జరిగిందన్న సంగతి చరిత్ర పుస్తకంలో చదువుకోవాలని హితవు పలికారు. కలిసుందామనేందుకు ఒక్క కారణం చెప్పకుండా చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంత్రి శైలజానాథ్ బాధ్యతగల మ్రంతిలా మాట్లాడటం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి తెలియదా అని ప్రశ్నించారు. దమ్ముంటే తెలంగాణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని, కాంగ్రెస్ బీఫారం విూద గెలిచి ఆ పార్టీ పంపిన బిల్లును ఎట్లా వ్యతిరేకిస్తారని అడిగారు. బిల్లుపై చర్చించకుండా పారిపోతున్నది మీరుకాదా అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. చరిత్రను విస్మరించి అబద్ధాలు చెప్పి ఇంకా సీమాంధ్ర ప్రాంత ప్రజలను మభ్య పెట్టాలని చూసేవారిని చరిత్ర క్షమించదన్నారు. కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి, కేంద్రానికి సుద్దులు చెప్పడం మాని తమను ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తే మంచిదన్నారు. ఎన్నికుప్పిగంతులేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని ఆయన స్పష్టం చేశారు.
శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లుపై జరుగుతున్న చర్చలో భాగంగా మంత్రి శైలజనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్వపక్షం నుంచే కాక విపక్షం నుంచి కూడా తీవ్ర నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మంత్రి తన ప్రసంగం ద్వారా తెలంగాణ వాసులను కించపరుస్తున్నారని టిడిపి మండిపడింది. అలాగే టీఆర్ఎస్ కూడా మంత్రి తీరును తప్పు పట్టారు. సిగ్గుంటే రాజీనామా చేసి మాట్లాడాలని ఎర్రబల్లి దయాకర్‌రావు ఘాటుగా విమర్శించారు. దొరల పదంపై దామోదర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక టిడిపి నేత రేవంత్‌రెడ్డి ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు. అవినీతి, అక్రమార్జనకు పాల్పడిన వారిలో ఒక్క తెలంగాణవారైనా ఉన్నారా అన్ని ప్రశ్నించారు. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన వారంతా సీమాంధ్రలేనన్నారు. స్వేచ్ఛావాయువు గురించి శైలజానాథ్ పులివెందులలో ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి ఏకీభవిస్తున్నట్లు తెరాస నేత కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మంత్రి శైలజానాథ్ మాట్లాడుతుండగా వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టిటిడిపి నేతలు రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, తెరాస నేత కెటి రామారావు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పిన శైలజానాథ్ పలుమార్లు దొర, పటేల్, పట్వారీ, దేశ్‌ముఖ్ పేర్లను ప్రస్తావించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దీనిపై రేవంత్ రెడ్డి ఆవేశంగా స్పందించారు. శైలజానాథ్ బిల్లు పైన తన అభిప్రాయం చెబితే అభ్యంతరం లేదని కానీ, తెలంగాణ ప్రజానికాన్ని అవమానించేలా అభిప్రాయం చెప్పి దానిని కేంద్రంపై రుద్దే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అభిప్రాయం చెప్పమంటే ఆయన కేంద్రం పంపించిన బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రజలను అవమానిస్తున్నారన్నారు. ఒక సత్యం, ఒక వైయస్ జగన్, ఒక గాలి, ఒక కోలా, ఒక కృషి వెంకటేశ్వర రావు వంటి వేలు, లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ వారంతా సీమాంధ్రులే అన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకెళ్లారని అభిప్రాయపడ్డారు. ఇందులో తెలంగాణ వారు ఉన్నారా అని ప్రశ్నించారు. మంత్రి అనంతపురం, పులివెందుల, రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి మాట్లాడితే బాగుండేదన్నారు. ఎయిర్ పోర్టు కోసం జివికె ఐదు వేల మంది సామాన్య రైతుల పొట్ట గొట్టారన్నారు. ఇక్కడి ఆస్తులు అమ్మి సీమాంధ్రలో ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. నిత్యం దొరల గురించి మాట్లాడుతున్న శైలజానాథ్.. అక్కడ నక్సలైట్లు ఎలా వచ్చారో చెప్పాలన్నారు. స్వాతంత్రం గురించి మాట్లాడే మంత్రి పులివెందులలో, తాడిపత్రిల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఏపాటి స్వాతంత్రం ఉందో చెప్పాలన్నారు. సమైక్యభావం గురించి చెప్పే హక్కు మాత్రమే ఉందని, తెలంగాణను అవమానించే హక్కు మాత్రం లేదన్నారు. తెలంగాణ నేతలను తాము సంస్కరించామని, మేం రాకముందు అనాగరికులమన్న రీతిలో శైలజానాథ్ మాట్లాడటం విడ్డూరమని కెటిఆర్ అన్నారు. సీమాంధ్రలో ఛాంపియనస్ ట్రోఫీలో భాగంగానే నాలుగు ఓట్ల కోసమే వారు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అన్ని విధాలుగా చర్చ జరిగాక కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును పంపించిందన్నారు. రేవంత్ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే వారు సంయమనం మాట్లాడాలని కోరుతున్నానని కెటిఆర్ చెప్పారు. దొరలు అంటూ పదేపదే చేసిన వ్యాఖ్యలపై దామోదర్ రెడ్డి స్పందించారు. ఓ సామాజిక వర్గంలో పుట్టడం ఎవరి తప్పు కాదని, తాను దొరల కుటుంబంలో పుట్టానని, తనను దొర అంటున్నా తాను ఎప్పుడు అలా భావించలేదన్నారు. శైలజానాథ్ పదే పదే దొరలు అనడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. బిల్లు తెలంగాణ సాయుధ పోరాటానికి వ్యతిరేకమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని శైలజానాథ్ అనడంపై తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపింది. నాడు వెట్టి చాకిరికి, దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, మంత్రి దానిని తప్పుదారి పట్టిస్తున్నారని, పదే పదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం అనడం కూడా సరికాదని, కేంద్రానికి చట్టం తెలియనట్లు- మాట్లడం సబబు కాదని ఈటెల రాజేందర్ అన్నారు. 2004లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రి జానా రెడ్డి ఓ సమయంలో ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేత అశోక గజపతి రాజు అన్నారు. అసెంబ్లీ అభిప్రాయం అంటే మెజార్టీ అభిప్రాయమేనని చెప్పారు. శైలజానాథ్ బిల్లును వ్యతిరేకిస్తుండటంపై టిటిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి స్పందిస్తూ.. ఢిల్లీలో చెప్పాల్సింది మంత్రి ఇక్కడ చెబుతున్నారని, ఆయన తీరు చూస్తుంటే కంది చేనులో వెతకాల్సింది ఎక్కడో వెతికినట్లుగా ఉందన్నారు. పిసిసి అధ్యక్షులు రెండు రాష్టాల్రు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారని, మంత్రులుగా వారికి మాట్లాడే హక్కు లేదని, శాసన సభ్యులుగా మాట్లాడవచ్చునన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం దోపిడీ వ్యతిరేక పోరాటం




