కోల్‌కతా, జనవరి 17 (జనంసాక్షి) :
సుప్రసిద్ధ బెంగాలీ నటి సుచిత్ర సేన్ శుక్రవారం ఉదయం కలకత్తాలోని ఒక ఆస్పత్రిలో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. 1950 వ దశకంలో బెంగాలీ చిత్ర రంగాన్ని ఏలిన సుచిత్ర సేన్ 1970 వ దశకంలో సంచలనం సృష్టించిన ఆంధీ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. బెంగాలీ సినిమా అభిమానులకు సుచిత్ర ఒక గ్రేటా గార్బో. ఆ రోజుల్లో బెంగాలీ చిత్ర అభిమానులు హాలీవుడ్‌కు గ్రేటా ఎంతో బెంగాల్‌కు సుచిత్ర అంత అని కొనియాడేవారు. సుచిత్ర సేన్ నటనా కౌశలానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. వయసు విూద పడిన అనంతరం ఆమె పెద్దగా బయటకు రాలేదు. ఒక దశ లో ఆమెకు భారత రత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించినా ఆమె తనకు ఆసక్తి లేదని చెప్పినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. సుప్రసిద్ధ బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ ఈమె కూతురే. ఇందిరాగాంధీ జీవిత చరిత్రలో ఒక భాగంగా ప్రచారం జరిగిన ఆంధీ చిత్రంలో సంజీవ్ కుమార్, సుచిత్ర సేన్ అద్భుతంగా నటించారు. దేవదాసు హిందీ చిత్రంలో కూడా సుచిత్ర నటించారు. గత రెండు రోజులుగా సుచిత్ర ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తున్నది. ముందు క్రిందటి నెలలో ఆమెకు శ్వాసకోశ సమస్య తలెత్తడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్చించారు. సుచిత్ర ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. అనంతరం మళ్లీ తిరగబెట్టడంతో ఆమెను రెండు రోజుల క్రితం మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. ఏ చికిత్సకూ ఆమె శరీరం సహకరించకపోవడంతో చివరికి శుక్రవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. ఉదయం కన్నుమూసిన ఒకనాటి ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రాసేన్‌కు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కోల్‌కతాలోని కియోరతాలా శ్మశానవాటికలో జరిగే అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గన్ శాల్యూట్ సమర్పిస్తారని ఆమె తెలిపారు.
సుప్రసిద్ధ నటి సుచిత్రాసేన్ కన్నుమూత




