బలవంతంగా కలిసుండటం కుదరదు : జేపీ
హైదరాబాద్, జనవరి 18 (జనంసాక్షి) :
జయప్రకాశ్ నారాయణ మళ్లీ మైండ్‌సెట్ మార్చుకున్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పడాల్సిందేనని పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చలో భాగంగా శనివారం అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ఎట్టి పరిస్థితిలోనూ జరుగాల్సిందేనని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందేనని, ఇందుకోసం లోక్‌సత్తా కేంద్రంపై ఒత్తిడి కూడా తెస్తుందని ఆపార్టీ అధినేత ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లుపై జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సుదీర్ఘంగా పలు సోదాహరణలను ఉటంకిస్తూ సామరస్య పూర్వకంగా విడిపోయేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంతోకాలంగా జరుగుతున్న పోరాటాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అదేసమయంలో ఇంకో ప్రాంతాన్ని కించ పరిచే భావన ఉండడం కూడా సరైంది కాదన్నారు. రాష్ట్ర విభజన అంశం విషయం సంతోషంగా లేకపోయినా నేటి పరిస్థితుల్లో అది అనివార్యమన్నారు. ఇప్పటికే 57 ఏళ్లుగా తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటాలు చేస్తూ ప్రాణాలు కూడా త్యాగం చేస్తూనే ఉన్నారన్నారు. బలవంతంగా కలిసి ఉండాలంటే రాబోయే రోజుల్లో కచ్చితంగా జననష్టం పెరుగడమేకాక ఆర్థిక నష్టం కూడా సంభవించే అవకాశాలున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుందన్నారు. దీనికి తెలుగు జాతి కూడా మూల్యం చెల్లించక తప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యం అని గుర్తించిన తర్వాతే లోక్‌సత్తా తన పంథాను మార్చుకుందన్నారు. స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు కావాల్సిందేనన్నారు. అధికార వికేంద్రీకరణ జరిగి తీరాలన్నారు. సిఎం చుట్టూ అధికారాలుండడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత యువత భవిష్యత్ ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు. ప్రతిఒక్కరిలో కొత్త ఆశలు చిగురింపచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన అభివృద్ది సాద్యం కానే కాదన్నారు. ఇరు ప్రాంతాలకు సమిష్టిగా నిధులు తెచ్చుకునేందుకు తెలుగువారం అంతా పోరాటం చేయాల్సినవసరం ఉందన్నారు. విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలకంటే చిన్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు ఏవిధంగా కేటాయిస్తున్నారో తెలుగువారికి ఎందుకు ఇవ్వడంలేదని పోరాటాలు చేయాల్సినవసరం ఉందన్నారు. తెలుగువారు ఒకరిపై ఇంకొకరు విమర్శలు చేసుకుంటూ పోవడం వల్ల అన్యాయం జరుగుతుందే తప్ప అభివృద్ది జరుగదన్నారు. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, తదితర రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధులను తెలుగు మాట్లాడే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే నిధులపై సమిష్టిగా పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన రహదారులపై గోడలు కట్టుకోరని, తెలుగు ప్రజలమధ్య విభజన కానేకాదన్నారు. ప్రతిఒక్కరు కూడా కలిసి మెలిసి ఉండే వాతావరణం సృష్టించుకోవాల్సినవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యం అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర అసెంబ్లీలో పూర్తిగా విభజన వచ్చిందన్నారు. ప్రాంతాల వారిగా నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విడిపోయారన్నారు. ఒకే పార్టీ రెండు ప్రాంతాలకు ఓకె చెప్పే సంస్కృతి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజనకు సంబందించి ప్రజల మద్య విభజన స్పష్టంగా వచ్చిందన్నారు. ఏఒక్కరుకూడా ఇంకొకరితో మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి లేనే లేదన్నారు. రాష్ట్ర విభజన అనేది ఇప్పుడు జరుగకపోతే రాబోయే రోజుల్లో నాయకులు కూడా తన్నుకునే పరిస్థితులు దాపురిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్యకూడా స్పష్టమైన విభజన వచ్చిందన్నారు. ప్రభుత్వ పాలననేది లేకుండా పోయిందనేది వాస్తవమన్నారు. ఒకరు ఇంకొకరితో కలిసి మాట్లాడుకునే సమయంలో నీవెక్కడి వ్యక్తివి అని తెలుసుకున్నాకే వివరాలు చర్చించుకుంటున్న సందర్బాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, పార్టీల్లో, ఎక్కడ చూసినా కూడా స్పష్టమైన విభజన వచ్చిన తర్వాత కలిసి ఉండడం అంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకోటి ఉండనే ఉండదన్నారు. ఒకలక్షా 62వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టుకున్న సమంయంలో కూడా కనీసం 162 సెకన్లు కూడా సమిష్టిగా చర్చించుకున్న పాపాన పోలేదని, దీనికి కారణం రాష్ట్ర విభజన ఉద్యమమేనన్నారు. గవర్నర్ ప్రసంగించే పరిస్థితులు లేవన్నారు. ఒకరు మాట్లాడితే ఇంకొకరు గౌరవించే అవకాశాలు లేనే లేవన్నారు. ఒక వర్గం కాదు జర్నలిస్టులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, కూలీలు, నాలీలు, డాక్టర్లు, లాయర్లు ఇలా ప్రతి ఒక్క సెక్షన్లో కూడా స్పష్టమైన విభజన వచ్చిందన్నారు. ఇంత విభజన వచ్చిన తర్వాతనే కేంద్రం తెలంగాణాను ఏర్పాటు చేసేందుకు ఆర్టికల్-3 ని వినియోగించి రాష్ట్రాన్ని విడగొడుతోందన్నారు. కాకపోతే ఎలా చేయాలనేది మాత్రం కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. తెలుగు ప్రజల మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మూడు ప్రాంతాల వారిని సమన్వయ పరిచి విభజించి ఉంటే ఎవ్వరికి అభ్యంతరం ఉండేది కానేకాదన్నారు. అయితే ఆర్టికల్-3 కూడా ఇక్కడ కేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఆయా రాష్టాల్ర విభజన సమయంలో అసెంబ్లీలు తీర్మాణం చేసిన తర్వాతే చేపట్టారన్నారు. బిఆర్ అంబేద్కర్ చెప్పిన అనేక అంశా లను ఇప్పటివరకు పాలకులు పాటిస్తూ వచ్చారని, ఒక్క ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలోనే కేంద్రం ఆర్టికల్-3ని వినియోగించి ప్రాంతాలవారితో చర్చించలేదన్నారు. అందరినీ ఒప్పించి చేసి ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చేది కానే కాదన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వచ్చినప్పుడు యావత్ తెలంగాణా సమాజం ఒక్కటై దానిని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అదే వ్యతిరేకత తెలంగాణ విషయంలో వస్తుందని అనుకోక పోవడం పొరపాటే అవుతుందన్నారు. పులిమెడలో తలపెట్టి రాజకీయ పార్టీలు నేడు సహవాసం చేస్తున్నాయన్నారు. ఎటునుంచి ఎటుఅడుగులు వేసినా కూడా ఖచ్చితంగా తలలు తెగిపోవడం ఖాయమన్నారు. విభజన విషయంలో అనేక అంశాలను క్రోఢీకరించకుండా కేంద్రం ఒంటెద్దు పోకడలతోనే పయనించిందన్నారు. గతంలో ఉన్న రాచరిక వ్యవస్థ, ధోరణి పోయిందని, నేడున్నది ఫెడరల్ వ్యవస్థన్నారు. దీనిప్రకారం చర్యలు తీసుకోవాలన్నదే తన అభిమతమన్నారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన సీమాంద్రులు హైదరాబాద్‌లోనో, తెలంగాణలోనో ఉండే పరిస్థితులు లేవనుకోవడం పొరపాటే అవుతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన అనేక హక్కులను వినియోగించుకునే అవకాశాలున్నాయన్నారు. 14వ అధికరణం ద్వారా చదువుకునే హక్కును అందరికి సమానంగా కల్పించిందన్నారు. 16వ అధికరణం ద్వారా ఏప్రాంతం వారైనా ఇంకో ప్రాంతంలో భూములు కొనుక్కోవడం, వ్యాపారులు చేసుకునే అవకాశాలు కల్పించిందన్నారు. ఒక్క గిరిజన ప్రాంతాల్లో తప్ప ఇంకే విషయంలో కూడా ఆంక్షలు లేనే లేవన్నారు. కొన్ని ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు ఓ ప్రాంతంలో వింటర్ సెషన్, మరోప్రాంతంలో సమ్మర్సెషన్ నిర్వహించుకునేలా పట్టణాలు అభివృద్ది చేసి ఉండాల్సిందన్నారు. రాబోయే కాలంలోనైనా ఓ ప్రాంతంలో విద్యాసంస్థలుంటే మరో ప్రాంతంలో వైద్య సౌకర్యాలు, ఇంకో ప్రాంతంలో పరిశ్రమలు, మరో ప్రాంతంలో మౌళిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఓ ప్రాంతంలో హైకోర్టు ఉంటే ఇంకో ప్రాంతంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సినవసరం ఉందన్నారు. గడిచిన 60 ఏళ్లలో ప్రధానంగా ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కానేకాదన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి తప్పిదాలు చేయవద్దన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణా, రాయలసీమ, కోస్తాంద్రల్లో భారీగా వెనుకబడి ఉన్నది రాయలసీమ ఒక్కటేనన్నారు. దీనిని ఆర్థికంగా సమతుల్యత తీసుకువచ్చేందుకు అన్ని ప్రాంతాల నాయకులు కలిసికేంద్రంపై పోరాటాలు చేయాల్సినవసరం ఉందన్నారు. 57 ఏళ్ల పాలనలో 30ఏళ్లకు పైగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే ముక్యమంత్రులుగా చేశారనేది ఒక్క తృప్తి మాత్రమే మిగిలిందన్నారు. అభివృద్ది విషయంలో ఏరంగంలో తీసుకున్నా కూడా ఇతర ప్రాంతాలకంటే కూడా కనీసం అందుకునేంత దూరంలో కూడా లేనే లేదన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణా ఇస్తున్న సమయంలో రాయలసీమను స్వయంప్రతిపత్తిగల ప్రాంతంగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సినవసరం ఉందన్నారు. ఇలాంటి రాష్ట్రాలు ఉత్తర భారతాన 11 ఉన్నాయన్నారు. ఆ రాష్ట్రాల కంటే కూడా రాయలసీమలో వెనుకబాటు తనం అధికంగానే ఉందన్నారు. ఇతర ప్రాంతాలకు కేంద్రం కల్పిస్తున్నటువంటి వందశాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపుతోపాటు నిధుల కేటాయింపులో ప్రత్యేక ఏర్పాట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కలిసి పోరాడాలన్నారు. సమష్టిగా పోరాటాలు చేస్తేనే తెలుగువారంతా ప్రపంచంలో తలెత్తుకుని తిరిగే అవకాశాలున్నాయన్నారు. రాయలసీమ ను స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా తీసుకురాగలిగితే తెలుగు ప్రజల మద్య సమతుల్యత వస్తుందన్నారు. బిల్లులో ఉన్న లోపభూయిష్టమైన వాటిని తొలగించాలన్నారు. రాజకీయం ఇసుకకోసమో, గనులకోసమో, ట్రాన్స్పోర్ట్ లైసెన్స్‌లు ఇప్పించేందుకు మాత్రమే వేదికగా మారుతున్నాయన్నారు. ఈ తరుణంలోనైనా రాజ్య వ్యవస్థను మార్చాల్సిందేనన్నారు. రాష్ట్రం విభజన తర్వాత 22 జిల్లాల్లో 22 నగరాలు, 200 పట్టణాలు అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. సర్వీస్ డెలివరీ కావాలన్నారు. నేడున్న అధికార లాలసం పోవాల్సిందేనన్నారు. ఆకాంక్షకోసం ప్రయత్నిస్తున్న పార్టీలున్నంత కాలం దౌర్భాగ్య పరిస్థితులు పోనే పోవన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ది చేసుకునేందుకు ప్రతి తెలుగు ప్రజాప్రతినిధి, 42 మంది ఎంపీలు కలిసి కట్టుగా కేంద్రంపై పోరాటం చేసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మళ్లీ మైండ్‌సెట్ మార్చుకున్న జేపీ పది జిల్లాల తెలంగాణ ఏర్పడాల్సిందే




