
హోం శాఖకు సీఎస్ లేఖ
హైదరాబాద్, జనవరి 18 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణపై శాసనసభ, శాసన మండలి అభిప్రాయాలు చెప్పేందుకు మరో నెల రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈమేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నుంచి తమకు లేఖ అందినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఆ లేఖను రాష్ట్రపతికి పంపుతామని వారు పేర్కొన్నారు. అంతకుముందు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఈమేరకు సీఎస్‌ను ఆదేశించారు. ఆయన స్పీకర్‌తో కలసి చర్చలు జరిపారు. లేఖ నేరుగా రాయడమా లేక అసెంబ్లీలో తీర్మానమా అన్నది వీరు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టి.బిల్లును చర్చించేందుకు మరో నెలరోజులు గడువు ఇవ్వాలని రాష్ట్రపతికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే బిల్లుపై చర్చ సాగుతోంది. ఆరువారాల గడువు ఇచ్చినా ఇప్పటికీ చర్చను పూర్తి చేయలేకపోయారు. అయితే గడువు కోరడం ద్వారా బిల్లు ప్రక్రియను ఆలస్యం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాగా, తెలంగాణ బిల్లుపై ఈనెల 23వ తేదీలోగా అసెంబ్లీలో చర్చను ముగించాలని టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తెలిపారు. అలా కాకుండా సీమాంధ్రనాయకుల లాబీయింగ్, కుట్రలకు లొంగి కేంద్రం మరో పదిరోజుల గడువు పొడిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చిన గడువును పెంచినా తెలంగాణ ఆవిర్భావానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి తదితరులతో శుక్రవారం కేసీఆర్ తన నివాసంలో పలు అంశాలపై చర్చలు జరిపారు.గడువు పెంచినా, పెంచకపోయినా నష్టం ఏవిూ ఉండదని ఆయన స్పష్టం చేశారు. బిల్లుపై గడువు పొడిగింపునకు సీపీఐ ఒప్పుకోదని ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే 23నే చర్చ పూర్తి చేయాలని చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 23 లోపే బిల్లుపై చర్చను పూర్తి చేయడానికి అన్ని పార్టీలు సహకరించాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు. అయితే సభ్యులంతా చర్చించేందుకు మరింత గడువు కావాలని టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రాబోయే రోజుల్లో సభ్యులుగా మన హక్కులు ఉపయోగించుకుందామని నరేంద్ర అన్నారు. ఇప్పటికైనా ముసుగులు తీసి ముందుకు రావాలని ఆయన వైకాపాను కోరారు. బిల్లుపై విస్తృతంగా చర్చించేందుకు రాష్ట్రపతి ఇచ్చిన సమయం సరిపోదని.. శాసనసభలో 294 మంది సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.
విభజన బిల్లుకు లెక్కకు మించి సవరణల ప్రతిపాదనలు : స్పీకర్
ఆంధప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుకు 9,024 సవరణ ప్రతిపాదనలు అందాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటికే పలువురు లిఖిత పూర్వకంగా సవరణలు ప్రతిపాదించారు. వాటన్నిటినీ క్రోడీకరించారు. సవరణ ప్రతిపాదనలను సోమవారం సభ్యులందరికీ అందిస్తామన్నారు. బిల్లుపై శాసనసభలో ఆందోళనలు, చర్చలు అభిప్రాయాలు, సవరణ ప్రతిపాదనలు, వాకౌట్లు, సభ్యుల సస్పెస్షన్ల నేపథ్యంలో వీటిని సభ ముందు ఎప్పుడు ప్రవేశపెడతారనేది ప్రశ్నార్థంకంగా మారింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, హైదరాబాద్, ఉద్యోగుల పెన్షన్, ఉమ్మడి రాజధాని, హైకోర్టు, ఉద్యోగుల పంపిణీ, విద్యుత్ పంపిణీ ఒప్పందాలు, కొత్త ప్లాంట్లు, విద్యా సంస్థల్లో కామన్ అడ్మిషన్, ఎన్టీపీసీలు, విశ్వవిద్యాలయాలు, నియోజకవర్గాలు.. ఇలా సమగ్రంగా అనేక అంశాలను ఆ సవరణ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. వీటన్నిటినీ క్రోడీకరించే పనిలో ఉన్నారు.
మరో నెల రోజులు గడువివ్వండి




