Tuesday, 3 November 2026

మైనార్టీ యువకుల అక్రమ సంకెళ్లు తొలగించండి సీఎంలకు మరో లేఖ రాస్తా

కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పునరుద్ఘాటన
కటక్‌, జనవరి 19 (జనంసాక్షి) :
అక్రమంగా జైళ్లలో మగ్గుతోన్న మైనార్టీ యువకుల సంకెళ్లు తొలగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. ఈమేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాస్తానని ఆయన పేర్కొన్నారు. ఆదివారం కటక్‌లో నిర్వహించిన ప్రకృతి విపత్తుల నివారణ దళం కార్యక్రమానికి ఆయన హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోని వివిధ జైళ్లలో మైనార్టీ వర్గాలకు చెందిన ఎంతోమంది యువకులు జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మైనార్టీలంటే ముస్లింలే కాదని, విచారణ లేకుండా వేలాది మంది యువకులు అక్రమంగా జైళ్లలో మగ్గుతున్నారని కేంద్ర హోం శాఖకు అందిన పిటిషన్ల మేరకే తానీ లేఖ రాస్తున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రులకు తమ మంత్రిత్వ శాఖ పక్షాన సూచనలందజేశామని తెలిపారు. అక్రమ నిర్బంధం రాజ్యాంగ విరుద్ధమని ఒకవర్గం వారిని అక్రమంగా అణచాలని చూస్తే అది మరో రూపం దాల్చే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. మత విద్వేషాలను రగల్చి ఓట్లు పొందాలని చూడటం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. సున్నితమైన విషయాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలను ఎవ్వరూ చూసిన అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా నిలుస్తుందన్నారు. ఒకవర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవహరించవద్దని, ఆ రకమైన సంకేతాలు శాంతికి విఘాతం కలిగించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక దేశంలో లౌకికత్వాన్ని వెదుక్కోవాల్సిన పరిస్థితులు తీసుకువచ్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, అలాంటి కుట్రలో ప్రజలు ఎప్పటికీ భాగస్వామ్యం కావొద్దని హితవు పలికారు. దేశానికి లౌకికవాదమే రక్ష అని ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి జీవించే హక్కు ఉందని, దాన్ని కాలరాసే అవకాశం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు అప్రమత్తంగా ఉండటం వల్లే ఇటీవల కాలంలో జననష్టం తగ్గిపోయిందని తెలిపారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రెస్క్యూ ఫోర్స్‌ను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, జాతీయ విపత్తుల నివారణ కమిటీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *