Tuesday, 3 November 2026

అసెంబ్లీలో కొలువుదీరిన అంబేద్కరుడు

60 ఏళ్ల తర్వాతైనా కనికరించిన పాలకులు
హైదరాబాద్‌, జనవరి 20 (జనంసాక్షి) :
శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ఆవిష్కరించారు. 60 ఏళ్ల తర్వాత పాలకులు రాజ్యాంగ నిర్మాతను గుర్తించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ మేరకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చొరవ తీసుకుని విగ్రహ ఏర్పాటుకు కృషి చేశారు. విగ్రహా ఆవిష్కరణ సమయంలో తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు పోటాపోటీ నినాదాలు ఇచ్చారు. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో అసెంబ్లీ ఆవరణ మొత్తం మారుమోగింది. ఇదిలావుంటే అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటుచేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని మార్చాలని టీడీపీ శాసనసభ సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. విగ్రహంలో అంబేద్కర్‌ రూపురేఖలు లేవని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహం పెట్టినందుకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *