Wednesday, 4 November 2026

తుస్సుమన్న ఏపీఎన్‌జీవోల ధర్నా

లగడపాటికి మైండ్‌ బ్లాక్‌
గుంజిపారేసిన పోరుబిడ్డలు
హోరెత్తిన జై తెలంగాణ
హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) :
సమైక్యాంధ్ర కోసమంటూ ఏపీఎన్జీవోలు తలపెట్టిన చలో హైదరాబాద్‌ తుస్సుమంది. సభలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తనకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టారు. ఇందిరాపార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన సభ లో విజయవాడ ఎంపీ సినిమా డైలాగులతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఎవడు కొడితే దిమ్మతిరుగుద్దో వాడే సమైక్యవాది’ ‘రోషానికి పౌరుషానికి విూసాలు అక్కర్లేదు’ ‘అసలు సినిమా ఐదో తేదీ నుంచి చూపిస్తాం’ ‘బిల్లు ఎందుకు తెచ్చామా అని తలలు పట్టుకునేలా చేస్తాం’ ‘కేవ్వు కేక అనిపిస్తాం’ ఇలాంటి చిల్లర డైలాగులతో తెలంగాణ వాదులను రెచ్చగొట్టాడు. దీంతో ఎవడబ్బ సొమ్ము హైదరబాద్‌ అని లగపటి రెచ్చగొట్టడంతో సభ సమీపంలోనే ఉన్న తెలంగాణ యువసేన నేత బండి కిరణ్‌ప్రకాశ్‌ ఉద్వేగంతో ఎవడు లాగితే లగడపాటి కిందపడుతడో… వాడే తెలంగాణ వాది అని లగడపాటికి తెలంగాణ సెగ చూపించాడు. కిరణ్‌ప్రకాశ్‌పై ఏపీఎన్జీవోలు దాడి చేశారు. ఈ దాడిలో కిరణ్‌ గాయపడ్డారు. బండి కిరణ్‌ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనతో ఇందిరా పార్క్‌ వద్ద గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లో సమైక్య సభ పెట్టడంపై తెలంగాణ స్టూడెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఇంకా దోచుకోవడం కోసమే సమైక్యమంటున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. బండి కిరణ్‌ప్రకాశ్‌ మావోయిస్టు నేత బండి ప్రకాశ్‌ కుమారుడు కావడం విశేషం. ఏపీఎన్జీవోలు తలపెట్టిన చలో హైదరాబాద్‌ నేపథ్యంలో ఇందిరాపార్క్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఇందిరాపార్క్‌ వైపు వెళ్లే రహదారులను బారీకేడ్లతో మూసేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్‌ చౌరస్తాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సెంట్రల్‌జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డితో పాటు పలువురు పోలీసులు అధికారులు ఇందిరాపార్క్‌ వద్ద పరిస్థిితిని పరిశీలించారు.
ఉమ్మడి రాజధాని రాజులేని రాజ్యం వంటిది : అశోక్‌బాబు
విభజనబిల్లులో పేర్కొన్న ఉమ్మడి రాజధాని రాజులేని రాజ్యం వంటిదని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ నిరూపించారని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ విబజన ముసాయిదా బిల్లును ఓడించి తిప్పి పంపాలని ఆయన సీమాంధ్ర నేతలకు సూచించారు. ఉమ్మడి రాజధాని ఏర్పాటైతే ప్రస్తుతం కేజీవ్రాల్‌ ఎదుర్కొంటున్న పరిస్థితి ఆంధప్రదేశ్‌కు వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇదో అర్థం లేని, ఆచరణ సాధ్యం కాని అంశమన్నారు. సమైక్య ఉద్యమం మలిదశలో ఉన్న తరుణంలో అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి రావడం శుభసూచకమని అశోక్‌బాబు అన్నారు. ఈ ధర్నాలో మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్‌, ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, సీఎం రమేష్‌, కాంగ్రెస్‌, టిడిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, ఇతర ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాకు సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా హాజరయ్యారు. ఏపీఎన్జీవోల సంఘం మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *