Tuesday, 3 November 2026

అయితే మాయే కాకిలెక్కలు చెప్పొద్దు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌
హైదరాబాద్‌, జనవరి23 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కష్టమో నష్టమో తామే చూసుకుంటామని, సమైక్య పాలనలో అభివృద్ధిపై కాకి లెక్కలు చెప్పొద్దని, తెలంగాణ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా చెప్పడం సీఎం చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. తమపై సానుభూతి చూపాల్సిన అవససరం లేదన్నారు. నీటి ప్రాజక్టుల గురించి సీఎం మాకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని హరీశ్‌ అన్నారు. లెక్కలు చూస్తే తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ నీరు వస్తాయని ఆయన తెలిపారు. సీమాంధ్రలో ప్రభుత్వమే కాల్వలు తవ్వి వాటిని నిర్వహిస్తోందని కానీ తెలంగాణలో మోటార్లకు కనీసం విద్యుత్తు కూడా సక్రమంగా సరఫరా చేయటంలేదని ఆయన విమర్శించారు. రాత్రి వేళల్లో విద్యుత్తు ఇవ్వడం వల్ల తెలంగాణాలో పలువురు రైతులు పాముకాటు, కరెంటుషాకు, చివరికి నక్సలైట్లు అనుకొని పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్లలలో కూడా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంత్రి మాటల్లో చూపిన ప్రేమ చేతల్లో చూపడంలేదన్నారు. సొంత జిల్లాకు వేలకోట్లు కేటాయించుకున్నారని ఆరోపించారు. అందులో కొంతయినా తెలంగాణకు ఎందుకు కేటాయించలేదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అని ఇచ్చి కరెంటే సరఫరా చేయలేదని విమర్శించారు. కరెంట్‌ కోసం రైతులు పొలాల వద్ద కళ్లు కాయలు కాసేలా కాపలా కాసి పాము తేలు కాటుకు గురై మరణించారని గుర్తు చేశారు. బోర్ల కోసం తెలంగాణ రైతులు రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. సీమాంధ్రలో ప్రాజెక్టుల ద్వారా నీళ్లిస్తారని, తెలంగాణలో వ్యవసాయ ఖర్చు రైతే భరించాలని దుయ్యబట్టారు. ఇదేనా సమైక్య నీతి అని ప్రశ్నించారు. మాటలు తెలంగాణకు, చేతలు సీమాంద్రకు, సొంతజిల్లాకా అని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులకు ఏదో చేసి ఉద్దరించినట్టు- సీఎం మాట్లాడుతున్నారని హరీష్‌రావు విమర్శించారు. అసెంబ్లీలోని విూడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు బిల్లుపై అసెంబ్లీలో చర్చకు ఇంకా గడువు పెంచాల్సిన అవసరంలేదని హరీష్‌రావు అన్నారు. సభ సజావుగా జరుగకుండా కొంతమంది సీమాంధ్రులు అడ్డుకుంటున్నారని, సభను అడ్డుకునేటోళ్లే గడువు కోరారని పేర్కొన్నారు. మళ్లీ పొడిగింపు ఇవ్వాలని టీడీపీ వాళ్లు కోరడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. సభలో సభ్యులు అందరు అభిప్రాయాలు చెప్పేలా స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సభను ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు నడిపించాలని కోరారు. శాసనసభలో తనను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని సీఎం కిరణ్‌ వ్యాఖ్యానించడంపై హరీష్‌రావు మండిపడ్డారు. తనను ఎన్నుకున్న సిద్ధిపేట ప్రజల కోసం నాలుగు కోట్ల ప్రజల కోసం తాను సీఎంను ఎదిరించి మాట్లాడటానికి భయపడనన్నారు. సీఎం శాసనసభా సాక్షిగా నిస్సిగ్గుగా మాట్లాడారు. నేను పుట్టిందే తెలంగాణ కోసం అని వ్యాఖ్యానించారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పలేక నోరు అదుపులో పెట్టుకోమంటున్నారు. తెలంగాణ ప్రజలకు, రైతులకు సీఎం ఏదో చేసినట్టు-, ఉద్దరించినట్టు- మాట్లాడుతున్నారు.రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలకు నీళ్ల ఇబ్బందులు వస్తాయని సీఎం అబద్ధాలు చెబుతున్నారని హరీష్‌రావు విమర్శించారు. ప్రాజెక్టులకు కేటాయింపులుంటే నీళ్లొస్తాయని తెలిపారు. అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు రావని పేర్కొన్నారు. గోదావరి, కష్ణా నదుల్లో మాకు దక్కే వాటా ఎంతో మాకు తెలుసు అని హరీష్‌ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *