అతిథిగా జపాన్ ప్రధాని షింజో
న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) :
గణతంత్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం దేశవ్యాప్తంగా 65వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అప్పటి వరకూ మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని వెళ్లగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. 1950, జనవరి 26నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతిగా.. భారతదేశం పూర్తి గణతంత్ర దేశమైంది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం.. ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలా కాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని కూర్చేందుకు బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. అనేక సవరణల అనంతరం 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాలు, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తిచేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. రాజ్యాంగాన్ని 1950, జనవరి 26వ తేదీనుంచి అమలు చేశారు. ఆనాటి నుంచి భారతదేశం ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర’ రాజ్యాంగంగా ఆవతరించింది. అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా మనదేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్థులకు పతాకాలను అందజేస్తారు. దేశ రాజధానిలోనూ, రాష్ట్ర రాజధానుల్లోనూ గొప్ప గొప్ప పరేడ్‌లను నిర్వహిస్తారు. వేలాదిమంది విద్యార్థులు పరేడ్‌లో పాల్గొంటారు. దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా, ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ, ప్రతి ఒక్క ఊరిలోనూ, ప్రతి ఒక్క పాఠశాలలోనూ గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు. ఇదిలా ఉండగా ఆదివారం జరగనున్న రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు అతిథిగా జపాన్ ప్రధాని షింజో హాజరుకానున్నారు. జాతి నుద్దేశించి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ప్రసంగించనున్నారు. అనంతరం త్రివిద దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.
.





