మంత్రివర్గానికి సంబంధం లేదు
ఐటీ మంత్రి పొన్నాల
కుట్రదారులెన్నటికీ నాయకులు కాలేరు : దామోదర
సంఘటితంగా ఎదుర్కొందాం : టీ సభ్యులు
హైదరాబాద్, జనవరి 26 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లును వెనక్కి తిప్పిపంపాలనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయానికి మంత్రివర్గంతో సంబంధం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బిల్లు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. అయితే, ఆయన నోటీసు నిర్ణయాన్ని ఒక ఎమ్మెల్యేగా తీసుకున్నారా.. ముఖ్యమంత్రిగా తీసుకున్నారా అన్నది స్పష్టం కావాల్సి ఉందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వారు సమావేశమై సోమవారం నుంచి అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తామందరం వ్యతిరేకిస్తున్నాము.. తామంతా తెలంగాణకే కట్టుబడి ఉన్నామని అన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కుట్రదారులెప్పటికీ నాయకులు కాలేరని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని గడువు కోరిన తర్వాత కూడా అది తప్పుల తడక అని, దీన్ని తిరస్కరించలని సభాపతి నాదేండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నోటీసు ఇవ్వడం తప్పిదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రపతి ముందుగా 42 రోజులు సమయం ఇచ్చారు, అందులో సగం సమయం వృధాగా గడిచి పోయింది. ఇన్ని రోజులు పాటు ప్రేక్షక పాత్ర పోషించారు, మరో వారం సమయం పొందిన తర్వాత బిల్లును వెనక్కు పంపాలని సభాపతికి ముఖ్యమంత్రి నోటీసు ఇవ్వడం బాధ్యతారాహిత్యం’ అని దామోదర రాజనర్సింహ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షనం తన పదవికి రాజీనామా చేయాలని దామోదర రాజనర్సింహ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పదవిలో అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు పార్టీ అధిష్టానాన్నే ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. బాద్యతాయుతమైన నేతకాన్న కుట్రదారుడిగా వ్యవహరిస్తున్నారని దామోదర ఆరోపించారు. సమైక్యాంధ్ర వాసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవ రూపం దాలుస్తుందన్నారు. శాసనసభలో చర్చించినా, చర్చించకుండా పంపినా పార్లమెంట్, తెలంగాణ బిల్లుకు వచ్చే సమావేశాల్లో ఆమోదిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చేనెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమన్నారు.
కిరణ్ ‘వెనక్కు’ నిర్ణయం





