హైదరాబాద్, జనవరి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో మౌళిక వసతులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. వ్యాపారులు, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అన్ని విధాల అనుకూలంగా ఉందని పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇసుజు మోటార్ ఇండియా కార్ల కంపెనీకి ముఖ్యమంత్రి సోమవారం ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి కార్ల కంపెనీ తన నియోజకవర్గంలో ఏర్పాటు కావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఓవి కుదుర్చుకున్న తొమ్మిది నెలల్లోనే కంపెనీని ప్రారంభించడం హర్షనీయమన్నారు. ఇక్కడ మాట్లాడేవారందరూ తెలుగు వారేనని స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుపతి దేవస్థానం, శ్రీహరికోట, పులికాట్ సరస్సులకు అతి దగ్గరలో కంపెనీని ఏర్పాటు చేయడం ముఖ్యంగా బెంగళూరు, మద్రాసు, చెన్నైలకు దగ్గరలో ఉన్నందున దీనికి అన్ని విధాల కలిసి రాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అనంతరం ఇసుజు ఇండియా సంస్థ ప్రసిడెంట్, ఎండి టకాషి కికుబి మాట్లాడుతూ 107 ఎకరాల విస్తీర్ణంలో దీనికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2016 నాటికి ఉత్పత్తులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మూడువేల కోట్ల పెట్టుబడితో ఏటా 12 వేల కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో మౌళిక వసతులు పుష్కలం : సీఎం కిరణ్




