కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతిస్తాం : మంత్రులు టిజి వెంకటేశ్, కాసు
కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేగా గెలిచినందున తాము కచ్చితంగా హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపిస్తామని తమ పేరును వాడుకుంటున్నారని మంత్రులు టిజి వెంకటేశ్, కాసువెంకటకృష్ణారెడ్డిలు స్పష్టం చేశారు. మంత్రులిద్దరు మీడియా పాయింట్ వద్దకు వచ్చి వారు వివరణ ఇచ్చారు. తమపేర్లను వాడుకుంటూ అధికారపార్టీ అభ్యర్థులకు విరుద్దంగా తాము ఎవరికిసంతకాలు చేయలేదన్నారు. తాము సమైక్యవాదాన్ని ప్రజల అభీష్టం మేరకే ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే తాము చేస్తున్న ఈప్రయత్నాలకు హైకమాండ్ ఎక్కడా అడ్డుకోలేదు కాబట్టి తమ వాయిస్‌ను గట్టిగానే వినిపిస్తామని తెలిపారు. చైతన్య రాజుకు తమ మద్దతు ఉందని మా మద్దతుతోనే పోటీ చేస్తున్నానని చెప్పడాన్ని వారు ఈసందర్భంగా ఖండించారు. తమ సంతకాలను ఎన్నికల అధికారి బట్టబయలు చేయాలన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమైక్యవాదంకు వ్యతిరే కంగా వ్యవహరిస్తే మాత్రం తాను పార్టీని వీడడం ఖాయమని చెప్పానని ఆపని చేస్తానన్నారు. అసెంబ్లీలోనే కాకుండా ఢిల్లీలోకూడా తమను అడ్డుకునే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పటికి కూడా తాము కాంగ్రెస్ అబ్యర్థులకే మద్దతిస్తామన్నారు. పార్టీ పక్షాన ఇంతకాలం గెలిచి అనేక పదవులు అనుభవించినందున పార్టీ నిర్ణయించిన ఎంపిలనే గెలిపించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతకు ముందు చైతన్య రాజు మాత్రం తనకు మద్దతుగా నామినేషన్‌పై టిజి వెంకటేశ్, కాసు వెంకటకృష్ణారెడ్డి సంతకాలు చేశారని చెప్పుకుంటూ నామినేషన్ వేయడం మరోవైపు ఏఐసిసి పరిశీలకులు హైదరాబాద్‌కు వచ్చి పరిస్థితిని గమనిస్తుండడంతో మంత్రులు వెనక్కి తగ్గారు. గత రాత్రివరకు సమైక్యాంధ్రకు మద్దతుగా ఖచ్చితంగా తమ పక్షాన అభ్యర్థులు రంగంలో ఉంటారని, ఇందులో చైతన్య రాజు ఒకరని, మరో వ్యక్తి ఆదాల ప్రభాకర్‌రెడ్డి లేదా జేసి దివాకర్‌రెడ్డిని చెప్తూ వచ్చిన ఈమంత్రులు పరిశీలకులు రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గారనే ప్రచారం జరుగుతోంది. ఈవిషయంపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఊరికే మీడియా పాయింట్ వద్ద నాలుగు మాటలు చెప్పితే సరిపోదని, స్పీకర్ వద్దకు పోయి తాము చైతన్యరాజుకు మద్దతివ్వడంలేదని లిఖితపూర్వకంగా రాసివ్వాలంటున్నారు. అలా అయితేనే వారిని నమ్ముతామని, ఇది ప్రతిపార్టీ కూడా చేసేది ఇదే పని అని బొత్స వెల్లడించారు. తాము మాత్రం కాంగ్రెస్ అధికార అబ్యర్థులను ఏమాత్రం వ్యతిరేకించడంలేదని మరో వ్యక్తికి మద్దతు కూడా ఇవ్వడంలేదని మంత్రులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చైతన్య రాజు మాత్రం తాను ఖచ్చితంగా రంగంలోనే ఉంటానని తేల్చి చెప్పారు. మంత్రులు వెనక్కి తగ్గినా కూడా తనకు గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా తనకు ఓటేస్తారని రాజు అభిప్రాయ పడుతున్నారు. ఒకరిద్దరు వెనక్కి తగ్గినా కూడా ఏమాత్రం నిరాశకు గురి కావడంలేదని, అయితే వారుకూడా తనకు ఖచ్చితంగా ఓటేసే సమయంలో మద్దతిస్తారనే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్‌లో రెబల్ బెడద కొనసాగుతుండడంతో ఏం చేయాలనే అంశంపై అధిష్టానం తోపాటు రాష్ట్రంలోని వారంతా మల్లగుల్లాలు పడుతున్నారు. చైతన్యరాజు రంగంలో ఉండడం వల్ల అటు కేవిపి రామచంద్రరావుకు ఇబ్బందికలుగుతుందా లేక టి సుబ్బిరామిరెడ్డికి నష్టం కలుగుతుందానే భయం మాత్రం రాష్ట్ర నేతలకు పట్టుకుంది. ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే ప్రాంతాల వారిగా విడిపోవడంతో తెలంగాణకు చెందిన అభ్యర్థులకు ఏమాత్రం ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో తెలంగాణ వాదులుగా కాంగ్రెస్ నుంచి ఎంఎ ఖాన్, టిఆర్‌ఎస్ నుంచి రంగంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత అయిన కేకేశవరావుల గెలుపు నల్లేరు మీద నడకలానే ఉండనుందని చెపుతున్నారు. అయితే టిడిపి పక్షాన తెలంగాణ కోటాలో పోటీ చేస్తున్న వలసవాది అయిన గరికపాటి మోహన్‌రావుకు సైతం కాస్తా ఇబ్బందులు తప్పక పోవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ మంత్రులు టిజి వెంకటేశ్, కాసు వెంకటకృష్ణారెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం చర్చనీయాంశంగా మారింది.




