సచార్ కమిటీ రిపోర్టు చాలావరకు అమలు చేశాం
ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ, జనవరి 29 (జనంసాక్షి) :
మైనార్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన జాతీయ వక్ఫ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ప్రధాని ప్రసంగించారు. సచార్ కమిటీ నివేదికలోని చాలా వరకు అంశాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ఆయన చెప్పారు. మైనార్టీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రధాన్యతలు కల్పిస్తున్నామని, వెనుకబడిన వారి అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టామని వివరించారు. మైనార్టీలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తామని అన్నారు. వక్ఫ్‌బోర్డుల ద్వారా మైనార్టీలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణతో పాటు వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతలు పకడ్బందీగా నిర్వహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం





