రెబల్స్ నామినేషన్లు సరైనవే : రిటర్నింగ్ అధికారి
హైదరాబాద్, జనవరి 29 (జనంసాక్షి) :
రాష్ట్రం నుంచి ఖాళీ అవుతోన్న ఆరు రాజ్యసభ స్థానాల బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు నిలిచారు. రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, చైతన్యరాజుల నామినేషన్లు సక్రమమేనని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం తేల్చిచెప్పారు. దీంతో రాష్ట్రంలోని ఆరు రాజ్యసభ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా రాజ్యసభ బరిలో దిగిన ఆదాల ప్రభాకర్, చైతన్యరాజు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారాం ఆమోదించడంతో ఇప్పుడు కాంగ్రెస్ శిబిరంలో గుబులు మొదలయ్యింది. వీరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని తేలడంతో ఇక ఎన్నిక అనివార్యం కానుంది. ఆరు రాజ్యసభ స్థానాలకు రాష్ట్రం నుండి తొమ్మిది మంది నామినేషన్ దాఖలు చేయగా.. స్వతంత్ర అభ్యర్థి భాస్కర్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు. ఉదయం నుంచి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నామినేషన్ల పరిశీలన జరిగింది. శాసనసభ ఆవరణలో ఈరోజు ఉదయం నుంచి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన 8మంది ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏం చేయాలన్నదానిపై వివరణ కోరారు. దీంతో ఎన్నికల అధికారి ఇక్కడికి వచ్చి పరిశీలన చేసినట్లు సమాచారం. సిఎం కూడా నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఆదాల, చైతన్యరాజుల నామినేషన్లను పెండింగ్‌లో ఉంచారు. పరిశీలన విషయంలో పై అధికారుల సలహాలు తసీఉకునేందుకు సదారాం ఎన్నికల అధికారికి ఫోన్ చేశారు.మద్దతిచ్చిన ఎమ్మెల్యేలను తన ముందు ప్రవేశపెట్టాలని రిటర్నింగ్ అధికారి ఇద్దరికీ గంట సమయం ఇచ్చారు. మరో వైపు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన వారిని కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి కేవీపీ రాంచంద్రరావు అసెంబ్లీ భవనంలో తన వద్దే కూర్చోబెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు బయటకు వెళ్తే మళ్లీ స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిస్తారనే ఉద్దేశంతో కేవీపీ ఎమ్మెల్యేలను తన వద్దే ఉంచుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంతో కొంత అసహనం ప్రకటించారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు గంటపాటు మంత్రి ఆనం ఛాంబర్‌లోనే ఉండాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సూచించారు. ఇదిలా ఉండగానే చైతన్యరాజుపై మంత్రి వట్టి వసంతకుమార్ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారాంకు ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు వివరాలను చైతన్యరాజు అఫిడవిట్‌లో పేర్కొనలేదని వట్టి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా చితన్యరాజుకు ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. సీఎం విజ్ఞప్తిని చైతన్యరాజు తిరస్కరించారు. చివరికి స్వతత్ర అభ్యర్థుల నామినేషన్లపై బొత్స అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. చైతన్యరాజు, ఆదాల ప్రభాకర్‌రెడ్డిల నామినేషన్లు సక్రమమేనని రిటర్నింగ్ అధికారి తేల్చారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. ఏం చేయాలన్నదానిపై సమాలోచనలో పడింది.




