Monday, 2 November 2026

ఏం ఫరాక్‌ పడదు

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఖాయం : కేసీఆర్‌
హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలు నిశ్చింతగా ఉండాలని, సీమాంధ్ర ఛానళ్ల ప్రచారానికి కన్ఫూజన్‌కు లోనుకావద్దని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సమైక్య ఛానళ్లు అవాస్తవాలు ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాయని తెలిపారు. సీమాంధ్ర నాయకులను చూస్తే బాధనిపిస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, జేపీతో సహా సీమాంధ్ర నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చిట్ట చివరి సమావేశం ముగిసింది… రాజ్యాంగ నిపుణులు, ఢిల్లీ పెద్దలతో మాట్లాడా… ఇబ్బందేం లేదని వారు చెప్పారని తెలిపారు.
15 రోజుల్లో తెలంగాణ కల సాకారమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి తలుచుకుంటే అసెంబ్లీ రద్దవుతుంది… ఆయన గురించి చంద్రబాబు ఇష్టారాజ్యంగా మాట్లాడడం అహంకారం కాదా…? అని ప్రశ్నించారు.
త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కన్‌ఫ్యూజ్‌ అవసరం లేదని తెలిపారు. కిరణ్‌ కిరికిరికి ఇదే లాస్ట్‌డే ఇంక అంతా ఢిల్లీలోనే కొనసాగుతుందని చెప్పారు. బిల్లును తిరస్కరించలేదు… స్పీకరే ఈ విషయం చెప్పారు. స్పీకర్‌ మొదట బిల్లు గురించి మాట్లాడి తర్వాత సీఎం తీర్మానం గురించి మాట్లాడారని గుర్తు చేశారు.
అసెంబ్లీ కేవలం అభిప్రాయం మాత్రమే చెబుతుందని తెలిపారు. అసెంబ్లీ తీర్మానం లేకుండానే చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. విభజన ప్రక్రియలో గెలవడం ఓడిపోవడం అనేది ఉండదని… విడిపోవడానికి కాదు… కలిసుండటానికే ఏకాభిప్రాయం కావాలని తెలిపారు. బిల్లు ఒకటే ఉంటుందని… రెండు మూడు ఉండవని పేర్కొన్నారు. పార్లమెంటు ఆమోదించిందే ఫైనల్‌ బిల్లు అని అన్నారు.
మెజార్టీ ఒపీనియన్‌ అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటే ఉండదు… అలా అనేవాళ్లు మూర్ఖులేనన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో పాల్గొని బంగారు తెలంగాణను కూడా సాధించుకుని తీరుతామన్నారు. తెలంగాణ వచ్చాక నేనేం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. అమరుల త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు.
సోనియాగాంధీ వల్లే తెలంగాణ వస్తుందని తెలిపారు. తెలంగాణపై బీజేపీ వెనక్కి తగ్గుతుందనేది అపోహేనన్నారు. ఢిల్లీలో సోనియగాంధీని, రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుస్తామన్నారు.
సీమాంధ్ర మీడియా ఇప్పటికైనా ప్రజల మద్య విషాన్ని పెంచడం మాని అన్నదమ్ములుగా విడిపోయి ఆత్మీయంగా కలిసుందామనే భావన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నాయకులు తమ ప్రజలకు ఏం కావాలో చెప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం కక్కడం సరికాదన్నారు.
జీవితంలో కేసీఆర్‌ ఎప్పుడూ ఓడిపోలేదని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని చెప్పారు. ఎన్నికల తర్వాత 2019 నాటికి అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనుకున్నది సాధించా… బంగారు తెలంగాణ సాధిస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *