Monday, 2 November 2026

బిల్లు ఓడిపోలేదు : నారాయణ


హైదరాబాద్‌, జనవరి 30 (జనంసాక్షి) :
శాసనసభ, మండలిలో ఓడిపోయింది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. ఓడిపోయింది తెలంగాణ ముసాయిదా కాదని, బిల్లును తిప్పిపంపాలనే ముఖ్యమంత్రి తీర్మానం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు బిల్లును వెంటనే రాష్ట్రపతికి పంపాలని నారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాసనసభలో విభజన బిల్లు ఓడిపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నాయి కానీ, ఆర్టికల్‌ 3 ప్రకారం బిల్లును ఆమోదించేందుకు పార్లమెంట్‌కు సర్వాధికారాలు ఉన్నాయని అన్నారు. బిల్లులో విభజనతో పాటు మిగతా ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తోడ్పడే విధంగా శాసనసభ, మండలిలో జరిగిన చర్చల ఆధారంగా సవరణలుచేసి బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపాదించాలని కోరారు. ఈ బిల్లును ఆమోదింపజేయడానికి కేంద్రహోంశాఖ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాలలో తెలిపిన అభిప్రాయాలకు కట్టుబడి యూటర్న్‌ తీసుకోకుండా బిల్లును ఆమోదింపజేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి ఇరు ప్రాంతాల అభివృద్ధికి అన్ని రాజకీయ పక్షాలు తోడ్పడాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *