Monday, 2 November 2026

తెలంగాణ రాష్ట్రంలో తిరిగొస్తా


ఆంధ్రప్రదేశ్‌లో వెళ్తున్న
15 రోజుల్లో మన కల సాకారం
విలువలు లేని మీడియా.. చిలువలు పలువల ప్రచారం
విశ్వసనీయత కోల్పోయారు
ఎవరూ అపోహపడొద్దు : టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌
హైదరాబాద్‌, జనవరి 30 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనే హైదరాబాద్‌కు తిరిగొస్తానని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరో పదిహేను రోజుల్లో కల సాకారం కాబోతున్నదని ఆయన పేర్కొన్నారు. బిల్లు కేంద్రానికి చేరాక ఇక ఢిల్లీ చూసుకుంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి రేపు ఢిల్లీకి వెళుతున్నాని, తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని కేసీఆర్‌ అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే తేదీలు కూడా తనకు తెలుసని కేసీఆర్‌ అన్నారు. బిల్లు ఆమోదం పొందుతుందని ఢిల్లీ పెద్దలే చెప్పారని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. స్వరాష్ట్ర, స్వయం పాలన ఆకాంక్ష త్వరలోనే నెరవేరబోతోందని కేసీఆర్‌ చెప్పారు.తాను రేపు ఢిల్లీ వెళ్తున్నానని, తిరిగి వచ్చేది తెలంగాణ రాష్ట్రంతోనేనని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన రాష్ట్రం ఏర్పాటుపై అనుమానాలు వద్దన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు తమ స్థాయికి తగ్గట్టు మాట్లాడడం లేదన్నారు. ఏం కావాలని కేంద్రం అడిగితే సీమాంధ్రలోని ఒక్క నాయకుడూ స్పందించలేదని కేసీఆర్‌ ఆరోపించారు. ఉత్తరాంచల్‌ కోసం ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం చేయలేదని, రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం పార్లమెంటుకే ఉందని ఉత్తరాంచల్‌ విషయం చెబుతోందని కేసీఆర్‌ అన్నారు. శాసనసభ కేవలం అభిప్రాయాలు చెప్పగలుగుతుందన్నారు. మెజార్టీ అభిప్రాయం ఈ జన్మలో జరగదన్నారు. మెజార్టీ అభిప్రాయం అంటే దేశంలో కొత్త రాష్ట్రాలే ఏర్పాటు కావన్నారు. రాష్ట్రాల ఏర్పాటులో ఇబ్బందులు వచ్చినప్పుడు పార్లమెంటు పరిష్కరిస్తుందని, ఇకనుంచి జరిగేదంతా ఢిల్లీలోనేనని కేసీఆర్‌ పేర్కొన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందితీరుతుందన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య నేతలు శాశ్వత వైరుధ్యాలు నాటుతున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. విభజనకు ఏకాభిప్రాయం అడిగేవాళ్లు కలిసి ఉండాలని ఎందుకు కోరడం లేదన్నారు. పార్లమెంటు ఆమోదించినదే తుది బిల్లు అని కేసీఆర్‌ చెప్పారు. బిల్లుకు తాను కూడా సవరణలు ప్రతిపాదిస్తానన్నారు. ఆయన తెలంగాణ భవన్‌తో విూడియాతో తనదైన శైలిలో మాట్లాడుతూ ఆంధ్ర విూడియా, సీమాంధ్ర నాయకులు లేనిపోని రాతలతో, కూతలతో పైశాచిక, శునకానందాన్ని పొందుతున్నాయని ఘాటుగా విమర్శించారు. సీమాంధ్ర నాయకులపై, వక్ర బాష్యాలు చెపుతున్న సీమాంధ్ర విూడియాపై విరుచుకపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు అంశం ఇక ఢిల్లీకి చేరిందని ఇక కిరణ్‌ కిరికిరి, చంద్రబాబు యాగి, జగన్‌ పెడబొబ్బలతో ఓరిగేదేమిలేదని ఆయన అన్నారు. నిచ్చింతగా ఉండండి, ఎట్లాంటి గందరగోళం చెందవద్దని తెలంగాణ యువత, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు- ఖాయమని ఆయన ఘంటాపదంగా చెప్పారు. తెలంగాణ ప్రజలు నిశ్చింతగా ఉండాలని, సీమాంధ్ర ఛానళ్ల ప్రచారానికి అపోహలకు లోను కావద్దని సూచించారు. సమైక్య చానెళ్లు అవాస్తవాలు ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నాయని తెలిపారు. సీమాంధ్ర నాయకులను చూస్తే బాధనిపిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, జేపీతో సహా సీమాంధ్ర నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని చెప్పారు. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ చిట్ట చివరి సమావేశం ముగిసింది…రాజ్యాంగ నిపుణులు, ఢిల్లీ పెద్దలతో మాట్లాడా.. ఇబ్బందేం లేదని వారు చెప్పారని తెలిపారు. 15 రోజుల్లో తెలంగాణ కల సాకారమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి తలుచుకుంటే అసెంబ్లీ రద్దవుతుంది.. ఆయన గురించి చంద్రబాబు ఇష్టారాజ్యంగా మాట్లాడడం అహంకారం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతినే తక్కువ చేసి మాట్లాడారని అన్నారు. రాష్ట్రపతి రాజ్యాంగపీఠానికి అధిపతి అని, అయన తలచుకుంటే అసెంబ్లీని కూడా రద్దు చేస్తారని ,ఉఫ్‌ అంటే అందరూ ఎగిరి పోతారని అన్నారు. అందువల్ల త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతుందని కన్‌ఫ్యూజ్‌ అవసరం లేదని తెలిపారు. కిరణ్‌ కిరికిరి కి ఇదే లాస్ట్‌ డే ఇంక అంతా ఢిల్లీలోనే కొనసాగుతుందని చెప్పారు. బిల్లును తిరస్కరించలేదు… స్పీకరే ఈ విషయం చెప్పారు. స్పీకర్‌ మొదట బిల్లు గురించి మాట్లాడి తర్వాత సీఎం తీర్మానం గురించి మాట్లాడారని గుర్తు చేశారు.అసెంబ్లీ కేవలం అభిప్రాయం మాత్రమే చెబుతుందని తెలిపారు. అసెంబ్లీ తీర్మానం లేకుండానే చాలా రాష్ట్రాలు ఏర్పాడ్డాయని చెప్పారు. విభజన పక్రియలో గెలవడం ఓడిపోవడం అనేది ఉండదని… విడిపోవడానికి కాదు.. కలిసుండటానికే ఏకాభిప్రాయం కావాలని తెలిపారు. బిల్లు ఒకటే ఉంటుందని… రెండు మూడు ఉండవని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఆమోదించిందే ఫైనల్‌ బిల్లు అని అన్నారు. మెజార్టీ ఒపీనియన్‌ అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటే ఉండదు.. అలా అనేవాళ్లు మూర్ఖులేనన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో పాల్గొని బంగారు తెలంగాణను కూడా సాధించుకుని తీరుతామన్నారు. తెలంగాణ వచ్చాక నేనేం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. అమరుల త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు.సోనియాంగాంధీ వల్లే తెలంగాణ వస్తుందని తెలిపారు. తెలంగాణపై బీజేపీ వెనక్కి తగ్గుతుందనేది అపోహేనన్నారు. ఢిల్లీలో సోనియాగాంధీని, రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుస్తామన్నారు. సీమాంధ్ర విూడియా ఇప్పటికైనా ప్రజల మధ్య విషాన్ని పెంచడం మాని అన్నదమ్ములుగా విడిపోయి ఆత్మీయుగా కలిసుందామనే భావన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నాయకులు తమ ప్రజలకు ఏం కావాలో చెప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం కక్కడం సరికాదన్నారు. జీవితంలో కేసీఆర్‌ ఎప్పుడూ ఓడిపోలేదని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని చెప్పారు. ఎన్నికల తర్వాత 2019 నాటికి అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనుకున్నది సాధించా… బంగారు తెలంగాణ సాధిస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *