
పునర్నిర్మాణంలో జేఏసీ పాత్ర ఉంటుంది
సంబురాలకు సిద్ధం కండి : కోదండరామ్
హైదరాబాద్, జనవరి 30 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో మరో అడుగు ముందుకేసామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇక కీలకభూమిక పోషిస్తామనిమని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు ఢిల్లీకి చేరిందని, దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. కిరణ్‌కుమార్ కొట్టిన సిక్సర్ తమకే ఉపయోగపడిందని అన్నారు. ఇక విజయోత్సవాలే మిగిలి ఉన్నాయని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను కేంద్రం కేవలం అభిప్రాయాలుగానే పరిగణిస్తుందని తెలిపారు. అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలని తెలంగాణ ముసాయిదా బిల్లు పంపారని, అంతిమ నిర్ణయం కేంద్రానిదేనని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని బిల్లులో స్పష్టం చేశారని అన్నారు. బిల్లు అసెంబ్లీని దాటి వెళ్లడం ఒక అడుగు ముందుకెళ్లినట్లేనని కోదండరామ్ అన్నారు. తెలంగాణ సాధన దిశగా మరో అడుగు ముందుకు పడిందని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు విజయోత్సవాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న వాటికి బెదిరిపోవద్దని అన్నారు. తెలంగాణ ఏర్పడటం ఖాయమని, తొందరలోనే ఆంధ్రా, తెలంగాణ శాసనసభల్లో సమావేశాలు విడి విడిగా జరుగుతాయని తెలిపారు. విభజన పక్రియ ముందుకు సాగుతోందని, 20, 25 రోజుల్లో ప్రత్యేక రాష్ట్రంలో ఉంటామని కోదండరామ్ పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ఓడిపోతే నష్టమేమీ లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని చెప్పారు.కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పాలని కేంద్రం చేసిన సూచనను గమనించాలన్నారు. శాసనసభలో సీఎం కిరణ్ వైఖరి ప్రజలను ఆవేశానికి గురిచేసిందన్నారు. అయినా తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో జేఏసీ పాత్ర ఉంటుందన్నారు.
మరో అడుగు ముందుకేసాం




