
ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు : జైపాల్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 31 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్ది తొండి తీర్మానమని, మూజువాణి ఓటుతో క్షణంలో తీర్మానం ఆమోదించడం తప్పుడు విధానమని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. దానికి రాజ్యాంగబద్ధతలేదని కేంద్ర మంత్రి అన్నారు. సీఎం ఏకపక్ష తీర్మానం వల్ల రాష్ట్ర విభజన ఆగిపోతోందన్నది వట్టి భ్రమ అని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం తీర్మానానికి రాజ్యాంగపరంగా విలువ లేదన్నారు. రాష్ట్ర పునర్య్యవస్థీకరణ బిల్లును తిరస్కరించాలంటూ సీఎం ఇచ్చిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో క్షణంలో ఆమోదించడం తప్పుడు విధానమని విమర్శించారు. ఆర్టికల్ 3 కింద అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రపతి బిల్లును పంపారన్నారు. ఆర్టికల్ 3కి సర్వసత్తాక అధికారం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కొన్ని తీసుకుని గవర్నర్‌కు ఇవ్వడంలో తప్పులేదన్నారు. ఏకపక్షంగా ఐక్యత కోరడంలో ఉండే అసహజత్వాన్ని గ్రహించడం లేదని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున విభజన వచ్చిన తర్వాత ఎలా కలిసుండాలని జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో 25 నుంచి 30 శాతం తెలుగుజాతి ఉందని, ఒకసారి రాష్ట్రం విభజించిన
తర్వాత ఎలాంటి ఆవేశాలు ఉండవన్నారు. ఫిబ్రవరి మూడోవారం ఆఖరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. ఫిబ్రవరి నెల మూడో వారానికల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పడుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందొద్దు. మేం ఇక్కడ ఉన్నాం. తెలంగాణను కచ్చితంగా తీసుకొస్తాం. నిశ్చింతగా ఉండండని ఆయన తెలంగాణ ప్రజలకు హావిూ ఇచ్చారు. రూల్-77 కింద చేసిన తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతదని, అసెంబ్లీలో తీర్మానం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్-3 ప్రకారం కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని రాష్ట్రపతి బిల్లును పంపితే వీళ్లు ఇక్కడ తీర్మానం చేశారని దుయ్యబట్టారు. ఈ తీర్మానం ఒక ప్రహసనంలా మారిందని దుయ్యబట్టారు. సీఎం తీర్మానం వల్ల వీసమెత్తు బలం కూడా తగ్గదని పేర్కొన్నారు. నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు లేకుండా తెలుగుజాతి లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని సీమాంధ్ర నేతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఏకపక్షంగా ఐక్యంగా ఉంటామని అనడం అసహజత్వమని తెలిపారు. ఈ విషయాన్ని సీమాంధ్ర నేతలు గ్రహించాలని సూచించారు. వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏకపక్షంగా ఐక్యత అనేది ఉండదని తెలిపారు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి అని కోరారు. తామేదో బిల్లును అడ్డుకుంటున్నామని సీమాంధ్ర నేతలు చెప్పుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదని జైపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్ధతు ఇస్తుందని మీరు భావిస్తున్నారా? అని విలేకరులు అడిగినపుడు జైపాల్‌రెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారు. తెలంగాణపై మొట్టమొదట నిర్ణయం తీసుకున్న పార్టీ బీజేపీయేనని జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాతే కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం తీసుకుందని వివరించారు. రాజమండ్రి జాతీయ సమావేశాల్లో ఆపార్టీ అన్నింటికన్నా ముందే తెలంగాణపై తీర్మానం చేసిందని వివరించారు. బీజేపీ బాధ్యతగల ఒక జాతీయపార్టీ. బిల్లుకు మద్ధతిస్తానని మాట ఇచ్చింది. కాబట్టి కచ్చితంగా మద్దతిస్తుంది. బీజేపీయే కాదు అన్ని జాతీయపార్టీలు తెలంగాణ బిల్లుపై స్పష్టతతో ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌పార్టీ పాలకపక్షం కాబట్టి అందరు నిందిస్తున్నారే తప్ప మరోటి కాదన్నారు. ఇంకా ఇతర పార్టీలు కూడా బిల్లుపై సారూప్య భావాలతో ఉన్నాయి అని పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు, జగన్‌కు బాధ్యతలేదా? అని ప్రశ్నించారు. ఏకపక్షంగా ఐక్యత కోరుకోవడంలో ఉండే అసహజత్వాన్ని సీమాంధ్ర నాయకులు గ్రహించడం లేదని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున విభజన వచ్చిన తర్వాత రాష్ట్రం కలిసుండం అసాధ్యమని చెప్పారు.
అది తొండి తీర్మానం




