మోడీ మార్క్ రాజకీయాలపై సోనియా మండిపాటు
గుల్బర్గ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) :
అధికారం కోసం బీజేపీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. కర్ణాటకలోని గుల్బార్గలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీజేపీ నాయకులు ప్రజల్లో విభజన తీసుకువస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన భారత్, ఆధ్యాత్మిక మత పెద్దలకు నిలయమైన కర్మభూమిలో ఇలాంటి విష బీజాలు నాటుతున్న వారిని లౌకికవాదులు అనుమతించబోరని ఆమె పేర్కొన్నారు. హింసాత్మాక రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారు విజయం సాధించలేరని ఆమె స్పష్టం చేశారు. అధికారమే పరమావధిగా ముందుకెళ్తున్న బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల వైఖరి పట్ల ఆచితూచి స్పందిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. స్వోత్కర్ష, పరనిందలతో ప్రచారం సాగిస్తోన్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు దేశ ప్రయోజనాల కోసం చేసిందేమిటని ఆమె ప్రశ్నించారు. అధికారమే లక్ష్యంగా రకరకాల కుట్రలకు బీజేపీ తెరతీస్తోందని ఆమె మండిపడ్డారు. అలాంటి వ్యక్తుల ఉద్దేశాలు, లక్ష్యాలు అర్థం చేసుకుని ప్రజలు వారికి దూరంగా ఉండాలని హితవు చెప్పారు. తమకు అధికారంపై బెంగలేదని, కానీ దేశం, ప్రజల అభ్యున్నతే తమకు ముఖ్యమని చెప్పారు. పేదల ఆత్మగౌరవం కోసం తాము పాటుపడుతున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల మధ్య సోదరభావం, సమాజంలో శాంతి సుస్థిరతల పరిరక్షణ ద్వారా వేగవంతంగా ప్రగతి సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సమాచార హక్కు చట్టం. లోక్‌పాల్‌చట్టంతో అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీ సహా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు శుష్క వాగ్దానాలు, తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో గత ప్రభుత్వ అవినీతి వల్లే కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు దరి చేరలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం స్థానికంగా ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు. విపక్షాల అవినీతి గురించి కొత్తగా తాను మాట్లాడాల్సింది ఏమీ లేదని, అన్ని విషయాలు ప్రజలకు తెలిసని ఆమె చెప్పారు. గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం హైదరాబాద్-బెంగళూర్ కర్ణాటక రీజియన్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేశారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సవరణలు తెచ్చి ఈ రీజియన్‌కు ప్రత్యేక హోదా కల్పించిందని చెప్పారు.
అధికారం కోసం విషం చిమ్ముతున్నారు





