Monday, 2 November 2026

హజ్‌ యాత్రకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) :
హజ్‌యాత్ర-2014కు భారీ ఏర్పట్లు చేపట్టనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అహ్మదుల్లా పేర్కొన్నారు. హజ్‌ యాత్ర నిర్వహణతో పాటు యాత్రికులకు వసతులు సమకూర్చుకున్నట్లు చెప్పారు. హజ్‌ యాత్ర-2014కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను శనివారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ నిరుడు 17వేల మంది నుంచి యాత్రకు దరఖాస్తు చేసుకోగా అందులో 7,456 మందికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం లభించిందన్నారు. ఈ ఏడుకోటాను పెంచేందుకు కృషిచేస్తానని చెప్పారు. హజ్‌యాత్ర నిర్వహణకు సంబంధించి ఏర్పాట్ల కోసం గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు కేటాయించిందని, ఈ సారి రూ. కోటిన్నర మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హజ్‌ హౌస్‌ను నిర్మించాలనే ప్రతిపాదనలు ఇంకా కొలిక్కి రాలేదని, నాంపల్లిలో ప్రస్తుతం ఉన్న హజ్‌హౌస్‌ పక్కన గల విశాలమైన ఖాళీ స్థలంలోనే సకల వసతులతో కూడిన హజ్‌ భవన్‌ను నిర్మించే యోచనలో ఉన్నామని, ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి, మంత్రుల బృందంతో చర్చించి నిర్ణయించాల్సి ఉందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌జలీల్‌ మాట్లాడుతూ హజ్‌యాత్ర-14కు సంబంధించి దరఖాస్తు ఫారాల పంపిణీ, స్వీకరణ కోసం హజ్‌హౌస్‌లో వీలైనన్ని ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. హజ్‌ దరఖాకస్తుదారులకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ప్రిన్సెస్‌ ఎరా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దరఖాస్తు సమర్పణకు కడువు మార్చి 15గా నిర్ణయించడమైందని, ఆలోపే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ముస్లింలకు సూచించారు. ప్రతీ 500 హజ్‌ యాత్రీకులకు ఒక ఖాదిముల్‌హుజ్జాజ్‌ (సహాయకుడు)ను నియమించడం జరుగుతుందన్నారు. హజ్‌యాత్రకు వెళ్లాలని భావించే వారెవరైనా ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని సూచించారు. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ హజ్‌ యాత్రికులకు ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్‌తో పాటు మక్కా, మదీనాల్లో కూడా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎం.డి ప్రొఫెసర్‌ ఎస్‌.ఎ.షుకుర్‌, ఎ.పి.స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఆబిద్‌ రసూల్‌ ఖాన్‌, పలువురు ముస్లింలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *