Tuesday, 3 November 2026

ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం

16 మంది మృతి
జకార్తా, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) :
ఇండోనేషియాలోని పశ్చిమ సమత్ర దీవుల్లో గల సినాబంగ్‌ అగ్నిపర్వతం మారణహోమం సృష్టిస్తూనే ఉంది. నాలుగు నెలల క్రితం బద్ధలైన ఈ అగ్నిపర్వతం భయోత్పాతం సృష్టిస్తోంది. శనివారమే ఇది ఎగజిమ్మిన లావా, వేడి బూడిద బారిన పడి పది మంది మృత్యువాత పడగా, ఆదివారం మరో 16 మందిని ఈ అగ్నిపర్వతం బలితీసుకుంది. రక్షణ బృందాలు ఆదివారం పూర్తిగా మాడిమసైన ఓ మృతదేహాన్ని గుర్తించాయి. తీవ్రంగా కాలి గాయాలతో బాధపడుతున్న ఓ విద్యార్థిని ఆస్పత్రి చేర్పించారు. అతను చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. నాలుగు నెలలుగా సినాబంగ్‌ అగ్నిపర్వతం మంటలు, లావా వెదజల్లుతుండటంతో దానికి సమీపంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 వేల మందికి పైగా ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. శుక్రవారం దాని ప్రభావం తగ్గడంతో గ్రామాల్లోకి ప్రజలు వచ్చేందుకు అధికారులు అనుమతించారు. అయితే శనివారం మళ్లీ అగ్నిపర్వతం పేలడంతో భారీ ప్రమాదం ముంచుకొచ్చింది. దీంతో రక్షణ చర్యలను ముమ్మరం చేశారు. మృతుల్లో టీవీ చానెల్‌ ప్రతినిధి నలుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు, స్థానికులు ఉన్నారు. మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిలోంచి 14 వేల మందిని అధికారులు స్వస్థలాలకు తిరిగివచ్చేందుకు అనుమతించారు. శనివారం మళ్లీ అగ్నిపర్వతం నుంచి భారీ పేలుళ్లు సంభవించాయి. 2,600 మీటర్ల ఎత్తు గల సినాబంగ్‌ అగ్నిపర్వతం గతేడాది సెప్టెంబర్‌ నుంచి తరచూ పేలుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *