Tuesday, 3 November 2026

బీకేర్‌ఫుల్‌ నీది బ్రహ్మాస్త్రమైతే

మా వద్ద పాశుపతాస్త్రముంది
డెప్యూటీ సీఎం రాజనర్సింహ
నల్గొండ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) :
తెలంగాణను అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గర బ్రహ్మాస్త్రముంటే తమ వద్ద పాశుపతాస్త్రం ఉన్నదని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. బ్రహ్మాస్త్రానికి విముక్తి ఉంటుంది కానీ పాశుపతాస్త్రానికి ఉండదన్న సంగతి ఆయన గుర్తు చేశారు. సోమవారం నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ అంతర్‌ జిల్లాల హాకీ పోటీలను ఆయన ప్రారంభించారు. కేవలం సీమాంధ్రలో అధికారం దక్కించుకోవడం కోసమే కిరణ్‌తో పాటు చంద్రబాబు, జగన్‌ అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దామోదర మండిపడ్డారు. తెలుగు ప్రజలు అంటే కేవలం సీమాంధ్రులే కాదని, తెలంగాణ వారూ తెలుగు ప్రజలేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రికి విధివిధానాలే లేవని ఆయన ఆరోపించారు. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. యువత చదవుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ అన్నారు. క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. అందుకే గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. అంతరించిపోతున్న హాకీ క్రీడను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పునరుద్ఘాటించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ చిరంజీవులు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడినవారు నిరుత్సాహపడకుండా గెలుపుకోసం కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలూనాయక్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *