Tuesday, 3 November 2026

అడ్డుకుంటామనుకోవడం భ్రమే


టీ మంత్రులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటామని సీఎం సహా సీమాంధ్ర నేతలు చెప్పడం వారి భ్రమేనని తెలంగాణ ప్రాంత మంత్రులు తేల్చిచెప్పారు. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన పక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుస్తామని మంత్రులు ఈ సందర్భంగా దిగ్విజయ్‌ను కోరారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసేందుకు తనకు అభ్యంతరం లేదని మంత్రులకు దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు. దిగ్విజయ్‌తో భేటీ అయ్యాక తమకు తెలంగాణ బిల్లుపై పూర్తిస్థాయి నమ్మకం ఏర్పడిందని తెలంగాణ నేతలు విూడియా ముందు అన్నారు. మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు మాట్లాడుతూ న్యాయసలహా తీసుకోనే తెలంగాణ బిల్లును పంపించారని, కోర్టుకు వెళ్లినంత మాత్రాన ఆగుతుందనుకోవడం భ్రమేనని అన్నారు. బీజేపీ పార్లమెంటులో తెలంగాణకు మద్దతు ఇస్తుందని మంత్రి డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మద్దతివ్వాలని అన్ని పార్టీల అధ్యక్షులను కలిసేందుకు వచ్చామన్నారు. బిజెపి మద్దతిస్తుందని డికె అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతలు తమ పబ్బం గడుపుకునేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాజ్‌నాథ్‌ను మాత్రమే.. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని బిజెపి నేతలను కలుస్తామని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు దిగ్విజయ్‌ సింగ్‌ను కోరారు. అయితే, ఆయన కేవలం జాతీయ అధ్యక్షులు రాజ్‌ నాథ్‌ సింగ్‌ను మాత్రమే కలవాలని, ఇతర నేతలను కలవవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. సిఎం వాదనతో తమకు సంబంధం లేదని మంత్రి గీతారెడ్డి అన్నారు. తమ ప్రజలు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారే తప్ప ఎవరి జోలికి వెళ్లలేదన్నారు. మెజార్టీ ప్రజలు ఎప్పుడూ విభజనకు అనుకూలంగా ఉండరని అన్నారు. తెలంగాణకు కేంద్రం సిద్ధంగా ఉందని దిగ్విజయ్‌ చెప్పారని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీక్ష చేసినా.. లగడపాటి రాజగోపాల్‌ ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర విభజన తథ్యమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఢిల్లీకి చేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఢిల్లీ బాటపట్టారు. ఈ సందర్భంగా హస్తిన చేరుకున్న గండ్ర అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కిరణ్‌, లగడపాటి దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని అన్నారు. కాగా అవసరం అయినప్పుడు చివరి బ్రహ్మస్త్రాన్ని వాడతామని లగడపాటి రాజగోపాల్‌ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరుతున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు చేరుకుంటున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *