Tuesday, 3 November 2026

ఈ సమావేశాల్లోనే తెలంగాణ


శాంతియుతంగా సహకరించండి
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
పార్లమెంట్‌ ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టబోతున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తేల్చిచెప్పారు. తెలంగాణ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీకి చేరిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మంగళవారం ఉదయం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కూడా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇది పది జిల్లాల ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్రంపై గవర్నర్‌ పెత్తనాన్ని, ఉద్యోగుల, పెన్షనర్ల కంపెనీ విధానంపై, విద్యుత్‌, విద్య, తదితర అంశాలపై బిల్లు ముసాయిదాలో పొందుపరిచిన విధానం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్‌ ప్రధాన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రధాని తెలంగాణకు తాముకట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. విభజన తరువాత కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు దేశంలోనే ఉంటాయని, ఈ పరిస్థితుల దృష్ట్యా సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని ప్రధాని కేసీఆర్‌ను కోరినట్టు సమాచారం. విద్యుత్‌, విద్య తదితర అంశాలపై తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను కేంద్రహోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేసీఆర్‌ ప్రధానికి సవివరంగా స్పష్టం చేశారు. బిల్లు ముసాయిదాలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉన్న అన్ని అంశాలపై కేసీఆర్‌ సవరణలు ప్రతిపాదించారు. వీటిని సవరిస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరదన్నారు. అన్నింటిని సావధానంగా విన్న ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు కేసీఆర్‌ మీడియాకు తెలిపారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తీరనున్న దృష్ట్యా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్టు కేసీఆర్‌ తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు స్వామిగౌడ్‌, జితెందర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, ఎంపీలు వివేక్‌, మందాజగన్నాథం, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు, భిక్షపతి, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహమూద్‌అలి తదితరులు ఉన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి అందరూ సహకరించాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కోరారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదంపొందుతుందని చెప్పారు. సుదీర్ఘ సంప్రదింపులు, తర్జనభర్జనల అనంతరమే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *