
సవరణలు ప్రతిపాదించాం
సమస్య పరిష్కరించుకుంటాం : జేడీ శీలం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రెండు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులను పిలిచి మాట్లాడటం మంచి పరిణామమని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు. తెలంగాణ ముసాయిదాపై తాము సవరణలు ప్రతిపాదించామని వాటిని జీవోఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వార్ రూమ్ సమావేశం తర్వాత జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో సీమాంధ్రకు న్యాయం చేయకుండా ముందుకు వెళ్తే సమస్యలు వస్తాయని తాము చెప్పామన్నారు. ఇరుప్రాంతాల సభ్యులను కూర్చోబెట్టి చర్చించడం మంచిదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, భద్రాచలం, పోలవరం, వనరుల పంపిణీ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని తమ నాయకత్వం కోరిందని ఆయన వివరించారు. తమ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తే విభజనకు సహకరిస్తామని చెప్పామన్నారు.
రెండు ప్రాంతాలతో మాట్లాడటం మంచి పరిణామం




