
మూలాలు మరిచావ్
మంత్రి కాలేనోడిని ముఖ్యమంత్రి చేస్తే తిరగబడతావా?
రాజనర్సింహ ఆర్‌పార్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్ కవర్ సీఎం అని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న సీఎం కిరణ్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అడిగేందుకు వెళ్లిన మహిళా మంత్రులపై అమానుషంగా ప్రవర్తించారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ఇదేనా తోటి మంత్రులకు ఇచ్చే గౌరవం అని ఆయన ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలకు పర్యాయపదం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌కు నైతిక విలువలు ఉంటే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. సీఎం వ్యవహార శైలి తెలంగాణ ప్రజలను కించపర్చేలా ఉందని తెలిపారు. సీఎం వైఖరిని తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్యాహ్నం విూడియాతో మాట్లాడారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, కుట్రలు పన్నినా దీక్షలు చేపట్టినా తెలంగాణ ఆగదన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి సోనియా మాట నిలబెట్టుకున్నారని, అయితే అధినేత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం మూలాలు మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అధిష్ఠానం సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుందని తమకు నమ్మకం ఉందన్నారు. 128 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తెలుసని అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనానికి సంబంధించిన విషయాన్ని కూడా అధిష్ఠానం చూసుకుంటుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అయితే ఈ దశలో ఇంకా ఎవరైనా తాము తెలంగౄణను అడ్డుకుంటామని అనుకుంటే అంతకన్నా మూర్ఖం మరోటి ఉండదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదని రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ఇస్తామన్న మాటను సోనియాగాంధీ నిలబెట్టుకుందని చెప్పారు. కిరణ్ ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ కల నిజం కాబోతుందని తెలిపారు. సీపీఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతిస్తున్నాయని, తెలంగాణ వస్తున్న సమయంలో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తున్నాడు. యావత్ తెలంగాణను సీఎం అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ ఒక ప్రాంతానికే నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. హైకమాండ్ అన్ని విషయాలు గమనిస్తోందని తెలిపారు. సరైన సమయంలో సీఎంపై సరైన చర్య తీసుకుంటుందని, ఎప్పుడేం చేయాలో మా హైకమాండ్‌కు బాగా తెలుసని పేర్కొన్నారు.
నీవు సీల్డ్ కవర్ సీఎం




