Tuesday, 3 November 2026

వలసవాదులు మోహరించిండ్రు


బిల్లు పెట్టే వరకూ అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఢిల్లీలో సీమాంధ్ర వలసవాదులు మోహరించిండ్రని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ అప్రమత్తంగా ఉండాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పారని, పార్లమెంట్‌లో బిల్లు మద్దతుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు ఢిల్లీలో భారీ లాబీయింగ్‌ నిర్వహిస్తున్నారని చెప్పారు. అయినా వారి కుట్రలు నెరవేరబోవని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఆగబోదని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ మద్దతుపై ఎవరూ ఆందోళన చెందవద్దని, రాజకీయ అంశాల్లో భాగంగా అలా మాట్లాడుతున్నారు కాని తాము తెలంగాణకు వ్యతిరేకమని ఆ పార్టీ చెప్పలేదని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చేలా తమ వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తమ లక్ష్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *