Wednesday, 4 November 2026

అవరోధాలు అధిగమించాలని కోరా

రాజ్‌నాథ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు : కేసీఆర్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడానికి ఉన్న అవరోధాలు అధిగమించేలా చూడాలని తాము రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విన్నవించామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. కొన్ని శక్తులు అవాంతరాలు సృష్టించినా త్వరతిగతిన బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రాష్ట్రపతి తమకు చెప్పారని కేసీఆర్‌ తెలిపారు. బిల్లును రాష్ట్ర శాసనసభకు పంపి రాజ్యాంగబద్ధ బిల్లుగా మలిచినందుకు ఆయన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం తాము 60 ఏళ్లుగా పోరాడుతున్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. అలాగే బిల్లుకు మద్దతివ్వాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరామని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పాస్‌ కావడం ఖాయమని ఆయన మరోమారు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు విభజన బిల్లు అడ్డుకునే ప్రయత్నంలో ఉండగా అందుకు పోటీగా కేసీఆర్‌ కూడా వివిధ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. గురువారం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలిసి తెలంగాణ బిల్లుకు మద్దతునివ్వాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పార్లమెంటులో మద్దతు పలకాలన్నారు. అనంతరం ఆయన రాజ్‌నాథ్‌ నివాస ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ సహకరిస్తుంది. బిల్లు పాసవుతుంది అని వ్యాఖ్యానించారు. మేము రాజ్‌నాథ్‌ను కలిశాం. టీ బిల్లుకు మద్ధతివ్వాలని కోమని,. అందుకు ఆయన హామీ ఇచ్చారు. బిల్లు పాస్‌ కావడానికి బీజేపీ సంపూర్ణ మద్దతిస్తుంది. బిల్లు తప్పకుండా పాసవుతుంది అని పేర్కొన్నారు. బిజెపి వెనక్కి పోయిందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ బిల్లుకు మద్ధతిస్తామని హావిూ ఇచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తున్నందుకు ఆయనకు కతజ్ఞతలు తెలిపారు. తాము చెప్పిన విషయాలన్నీ రాజ్‌నాథ్‌ సావధానంగా విన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ కావడం ఖాయమని అన్నారు. అవసరమైతే సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్‌ చేసైనా సరే బిల్లు పాస్‌ చేయాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఇక ఎవరూ అపోహలకు లోనుకావొద్దని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తాను తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు కూడగడుతున్నానని, కాంగ్రెస్‌, బీజేపీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు బిల్లు పాస్‌ చేసేందుకు అవి కృతనిశ్చయంతో ఉన్నాయని పేర్కొన్నారు. సీమాంధ్ర మీడియా తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్ముతోందని వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటును మాత్రం ఆపబోరన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *