
కేకే గెలుపుతో తెలంగాణ వాదుల్లో ఉత్సాహం
నా గెలుపు తెలంగాణ అమరులకు అంకితం: కేకే
హైదరాబాద్,ఫిబ్రవరి7(ఆర్‌ఎన్‌ఎ): రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లుగానే బరిలో ఉన్న ఆరుగురు అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించారు. రాజ్యసభకు సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, గరికపాటి రామ్మోహన్‌రావు, సీతారామలక్ష్మి, ఎంఏ ఖాన్, కే కేశవరావు ఎన్నికైనట్టు ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎంఏ ఖాన్-49, కేవీపీ-46, సుబ్బిరామిరెడ్డి-46, గరికపాటి-38, రామలక్ష్మి-38, కే కేశవరావు-26 ఓట్లు పొందారు. ఈ ఎన్నికల్లో నాలుగు చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఒక ఓటు తిరస్కరణ ఓటుగా పోలైంది. తిరస్కరణ ఓటును దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు వేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు పోటీచేసిన ఆపార్టీ జాతీయ కార్యదర్శి కే కేశవరావు ఎన్నిక కావడం తెలంగాణ ప్రజల విజయమని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ విూడియాతో మాట్లాడారు. కేకే గెలుపు యావత్ తెలంగాణ గెలుపు అని వ్యాఖ్యానించారు. తొలిసారిగా టీఆర్‌ఎస్ పెద్దల సభ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నందుకు తెలంగాణ ప్రజలు ఆనందంతో ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పక్షాన ఈటెల రాజేందర్ కేకేకు కతజ్ఞతలు తెలిపారు. కేకేకు ఓటు వేసిన సీపీఐ ఎమ్మెల్యేలకు ధన్యావాదాలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో తగినంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సిందేనని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో విూడియాతో మాట్లాడిన గండ్ర.. పార్టీకి తగినంత బలం లేని కారణంగా వైఎస్సార్ సీపీ పోటీకి దూరంగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాలుగో అభ్యర్థికి సరి పడా బలం లేని కారణంగా ముగ్గురు అభ్యర్థులతోనే పోటీకి సిద్ధమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైనందున కే.కేశవరావు(కేకే) పార్టీని వీడారని గండ్ర తెలిపారు. గత అనుబంధంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు కేకే ఓటు వేశారన్నారు. ఈ ఎన్నికకు టీఆర్‌ఎస్ విలీనానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన పిటీషన్లును సుప్రీంకోర్టు తిరస్కరించిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సమంజసం కాదని సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు.
ఆ ఆరుగురే రాజ్యసభకు




