Wednesday, 4 November 2026

ఆంక్షలు లేని తెలంగాణే కావాలి : కోదండరాం


ఢిల్లీలో టీజేఏసీ మౌనదీక్ష
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (ఎపిఇఎంఎస్‌) : హస్తినలో శుక్రవారం కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై టిడిపి ఎంపీలు ధ్వజమెత్తారు. లోక్‌సభలోనూ అవిశ్వాస నోటీసు ఇచ్చారు. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనీయబోమంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌ ఎంపి మధుయాష్కి మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తంచేశారు. సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలంటూ టి.జేఎసి చైర్మన్‌ కోదండరాం మౌనదీక్ష కొనసాగించారు. మీడియా ఎదుట వారు ఇలా..
అంతుచూస్తాం : శివప్రసాద్‌
అంతుచూస్తాం.. బిల్లును ప్రవేశపెట్టనీయబోం.. తెలుగుజాతిని విడదీస్తే సహించబోం.. అంటూ టిడిపి ఎంపి శివప్రసాద్‌ మండిపడ్డారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో శుక్రవారం మీడియాతో టిడిపి ఎంపీలు శివప్రసాద్‌, కొనకళ్ళ సత్యనారాయణ, సిఎం రమేష్‌, సుజనా చౌదరి మాట్లాడారు. తొలుత శివప్రసాద్‌ మాట్లాడుతూ, విభజనపై దూకుడుగా ఉన్న కేంద్రానికి ముక్కుతాడు వేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ బిల్లును ప్రవేశపెట్టనీయబోమని, తెలుగుజాతి పౌరుషాన్ని చూపిస్తామని సవాల్‌ విసిరారు.
ఊరుకోబోం.. : కొనకళ్ళ
మరో ఎంపి కొనకళ్ళ సత్యనారాయణ మాట్లాడుతూ, ఊరుకోబోం.. బిల్లును అడ్డుకుంటాం.. లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ బిల్లును ప్రవేశపెడితే ఒక గంట కూడా సాగనివ్వబోమని మండిపడ్డారు. అవిశ్వాస నోటీసులు ఇచ్చినా తిరస్కరించడం శోచనీయమన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయండి.. లేదా సమైక్యంగా ఉంచండి అని డిమాండ్‌ చేశారు.
బిల్లు రాదు : రమేష్‌
మరో ఎంపి సిఎం రమేష్‌ మాట్లాడుతూ, పార్లమెంట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు రాబోదని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంటికి వెళ్ళే రోజులు దగ్గపడ్డాయనిత సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానం ఎక్కుతున్నా.. తెలంగాణ రాష్ట్రంలో విమానం దిగుతా అన్న కేసిఆర్‌ మాటలు నెరవేరబోవన్నారు. ఆయన ఢిల్లీలోనే ఇల్లు చూసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఆటలాడొద్దు : సుజనా
మరో ఎంపి సుజనా చౌదరి మాట్లాడుతూ, తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్నారు.. తెలుగుజాతి కంట కన్నీరు పెట్టించిన ఎవ్వరూ బతికి బట్టకట్టిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపెట్టనీయబోమని చెప్పారు.
ప్యాకేజీలొద్దు : మోదుగుల
సమైక్యంగా ఉంచండి.. ప్యాకేజీలొద్దు అని టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. సమైక్యంగా ఉంచితే తమ బతుకులు తాము బతుకుతామని చెప్పారు. తాము పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస నోటీసుపై చర్చించాలని కోరారు. నోటీసుపై చర్చించేంత వరకు బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుపై చర్చను జరగనీయబోమని తెలిపారు.
ఆమోదం ఖాయం : మధుయాష్కి
పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడం ఖాయమని కాంగ్రెస్‌ ఎంపి మధుయాష్కి అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణ ఆగబోదన్నారు. ఒకరేమో నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.. మరొకరేమో వేర్వేరు ప్రాంతాలకు సైతం వెళ్ళి గోడు వెళ్లబోసుకుంటున్నారు.. అయినా వారి ఆశలు నెరవేరవు.. కలలు తీరవు అని జోస్యం చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం ఆ పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతానికి అద్దం పడుతోందని విమర్శించారు.
ఎపి భవన్‌ వద్ద..
ఎపి భవన్‌ వద్ద టి.జేఎసి మౌనదీక్ష చేపట్టింది. సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని నినదించింది. శుక్రవారం మధ్యాహ్నం ఎపి భవన్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద టి.జేఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మౌనదీక్ష చేపట్టారు. దీక్షలో టిజివో అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్‌, టిఆర్‌ఎస్‌ అగ్రనేత కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మౌనదీక్ష చేపట్టేందుకు ముందుగా కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాటకు బిజెపి కట్టుబడి ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. బిజెపి చేయిస్తుందేమోనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఒకవేళ బిజెపి గీత దాటితే తెలంగాణ ప్రజా క్షేత్రంలో నిరసన ఎదుర్కోవడం ఖాయమన్నారు. కానీ బిజెపిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌ ఎన్నోమార్లు మాట ఇచ్చారని చెప్పారు. అయితే, తమకు సంపూర్ణ తెలంగాణాయే కావాలని కోరుతున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *