
వేటు వేయకముందే తప్పుకోవడం మేలని సీనియర్ల సూచన
అధిష్టానం నిర్ణయంతో కిరణ్ కుదేల్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఎపిఇఎంఎస్): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానంపై ఎదురుతిరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పించే ప్రయత్నం మొదలు పెట్టడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఎలాగూ అధిష్టానం వేటు వేయడం కన్నా స్వచ్ఛందంగా తానే పదవి నుంచి తప్పుకుని పరువు నిలబెట్టుకోవడంతోపాటు సీమాంధ్రలో హీరో కావాలన్న భావనతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అధిష్టానం మన్ననలను పొందాలని భావిస్తున్నా అధిష్టానం మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. గతంలో రాష్ట్రం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోని అధిష్టానం ఢిల్లీ వేదికగా సీఎం దీక్ష చేపట్టడంపై సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా ఆయనపై కచ్చితంగా వేటు వేయాలనే నిర్ణయంతో అధిష్టానం ముందుకు పోతోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10 తరువాత ఏం జరుగుతుందో చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో పరోక్షంగా ముఖ్యమంత్రి తప్పదని సంకేతాలు ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రిపై వేటు తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సంకేతాలను ముందే గ్రహించిన ముఖ్యమంత్రి ఈ నెల 10లోగా ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన అనుచరులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అవసరమైతే శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వెనక్కితగ్గే పరిస్థితులు కనిపించడంలేదు. ఇప్పటికే తెలంగాణ బిల్లులో బీజేపీ చేస్తున్న సవరణలను సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల ద్వారా చెప్పించి వాటిని బిల్లులో చేర్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. బీజేపీ చెబుతున్న సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉండటంతో బీజేపీ మద్దతు విషయంలో ఎటువంటి అనుమానాల్లేవు. అదేకాకుండా గురువారం రాత్రి బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుతో జీఓఎం సభ్యుడు, కేంద్రమంత్రి జైరామ్ రమేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంలోనే పలు అంశాలపై చర్చించిన మీదట బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ గమనించిన ముఖ్యమంత్రి ఎలాగూ విభజనను ఆపలేకపోతున్నాననే ఆక్రోశంతో కనీసం సీమాంధ్ర ప్రజల దృష్టిలో హీరో కావాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆయనను అనుసరించే కొందరు సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రిని వారిస్తున్నట్టు సమాచారం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలనే కచ్చితమైన నిర్ణయానికే వచ్చినట్టు సమాచారం.
రాజీనామాకు సిఎం సిద్ధం?




