టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) :
ఏ ప్రాంతం ఉద్యోగులు అక్కడే ఉద్యోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గొడవ చేస్తారన్న కారణంతో సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీలు ప్రకటించి తెలంగాణను విస్మరించడం తగదని ఈటెల అన్నారు. శనివారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భంగపడింది.. అన్యాయానికి గురైంది తెలంగాణ ప్రాంతమేనన్నారు. ప్యాకేజీలు ఇవ్వాల్సివస్తే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుత తరుణంలో తెలంగాణ బిల్లుకు మద్దతు విషయంలో భాజపా వెనక్కు తగ్గుతుందని తాము భావించడం లేదని ఈటెల అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావొస్తున్నా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి వలస పాలనే కారణమన్నారు. హైదరాబాద్ నగరం మినహా తెలంగాణలోని మిగతా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి తాము వ్యతిరేకమని, నగరంలోని విద్యాసంస్థల్లోని సీమాంధ్రులకు రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణికి పూర్వ వైభవం తీసుకురావాలని, ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.





