Wednesday, 4 November 2026

నేడు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌


మనం సహకరించొద్దు : టీ మంత్రులు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) :
రాష్ట్ర శాసనసభ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాలులో మంత్రివర్గం సమావేశం కానుంది. 10.08 గంటలకు అసెంబ్లీలో ఓటు ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రవేశపెట్టనున్నారు. 13వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సభకు సహకరించద్దని ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా ఉందని, దాన్ని తిప్పిపంపాలంటూ ఇటీవల అసెంబ్లీలో సీఎం కిరణ్‌ తీర్మానం ప్రతిపాదించగా, దాన్ని సభలో ప్రవేశపెట్టి స్పీకర్‌ మనోహర్‌ ఆమోదింపజేయడంపై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించి సభ సాగనివ్వరాదని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. మంత్రులు సైతం అంతే స్థాయిలో ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే కేబినెట్‌ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని నిర్ణయించకుకున్నారు. దీనిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరిపై తాము అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నామని, అందుకే కేబినెట్‌ సమావేశాన్ని బహిష్కరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ఉదయం 10.8 గంటలకు అసెంబ్లీలో వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మంగళవారం ఎమ్మెల్యేలకు బడ్జెట్‌పై అధ్యయనం చేయడానికి అవకాశమిస్తారు. బుధ, గురువారాల్లో బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ జరుపుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *