
దేశవ్యాప్తంగా స్తంభించిన లావాదేవీలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) :
బ్యాంకుల హడ్తల్ విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా లావాదేవీలు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మెతో ఏటీఎంలలో ఎక్కడా రూపాయి లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు స్తంభించాయి. రెండు రోజుల సమ్మెతో బ్యాంక్‌లు పనిచేయలేదు. బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకుందామంటే ఒక్క బ్యాంకూ పనిచేయట్లేదు. వేసిన చెక్కులు వేసినట్లే, క్లియరెన్సు లేకుండా ఆగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల సిబ్బంది, అధికారులు సమ్మె చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వేతనాలు సవరించాలని డిమాండు చేస్తూ సిబ్బంది ఈ రెండురోజులూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ లాంటి ప్రైవేటురంగ బ్యాంకులు పని చేయడంతో వినియోగదారులకు కొద్ది ఊరట లభించింది. వేతనాల సవరణకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ముందుకు రాకపోవడంతో తాము సమ్మెకు దిగక తప్పలేదని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు. వేతనాలను పది శాతం పెంచుతామంటూ ఐబీఏ చేసిన ఆఫర్ను యూనియన్లు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుండటంతో ఈ పెంపు ఏమాత్రం సరిపోదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి అశ్వినీ రాణా అన్నారు. అందరూ సమ్మెలో పాల్గొనడంతో హైదరాబాద్‌లో బ్యాంక్ కార్యకలాపాలు స్తంభించాయి.
బ్యాంకుల హడ్తల్ సక్సెస్




