చర్చల్లో పాల్గొనకపోవడం పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధం
సీమాంధ్ర సభ్యులకు రాష్ట్రపతి పరోక్ష చురక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) :
చట్టసభలకు ఎంపికైన ప్రతినిధులు ప్రజల పక్షాన చర్చలో పాల్గొనాలేకాని తమ ఆందోళనలతో సభలను అడ్డుకోవడం సబబుకాదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సీమాంధ్ర ఎంపీలకు పరోక్షంగా చురకలంటించారు. ఇటీవల వరుసగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఎలాంటి చర్చ సాగకుండానే వాయిదా పడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులు చర్చల్లో పాల్గొనకపోవడంతో పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఉన్నదే చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడానికి అన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా సభ్యులు సభను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి సందర్భంలో సభ్యులు తమ బాధ్యతను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. లోక్‌సభ స్పీకర్లుగా పనిచేసిన వారి చిత్రపటాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోక్‌సభలో వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తదితరులు హాజరయ్యారు.




