Wednesday, 4 November 2026

ఫలించిన బాబు కుట్ర


తెలంగాణ బిల్లుకు దీదీ నో
కోల్‌కతా, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు పలికారు. తెలంగాణను అడ్డుకునేందుకు ఎక్కే గడపా దిగే గడపా అన్నట్టుగా తిరుగుతున్న చంద్రబాబుకు దీదీ కాస్త ఊరటనిచ్చారు. తాము సమైక్య భారతావనినే కోరుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్‌ను విభజించే బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని టీఎంసీ అధికార ప్రతినిధి డెరెక్‌ ఓబ్రియాన్‌ మీడియాకు తెలిపారు. బాబు, మమత భేటీ సందర్భంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపైనా చర్చ సాగింది. కాంగ్రెస్‌, బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీదీ ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో దీదీ ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కలిసికట్టుగా ఉండాలని, ముందుగానే కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలని ప్రాంతీయ పార్టీలకు మమత పిలుపునిచ్చారు. మమతతో భేటీ అనంతరం తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మరికొన్ని పార్టీల మద్దతు కూడగట్టడం కోసం బాబు ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ వివిధ పార్టీల నేతలతో తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *