Wednesday, 4 November 2026

వేటుపడింది ఆ ఆరుగురు వెలి

సొంత పార్టీపై అవిశ్వాసం పెట్టిన పర్యవసానం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :
సొంత పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీస్‌ ఇచ్చిన ఆరుగురు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలపై అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌క ముదుకు వచ్చిన వేళ కాంగ్రెస్‌ సీరియస్‌గా స్పందించి వారిపై కఠిన చర్యకు ఉపక్రమించింది. గతకొంతకాలంగా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్‌ సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆ ఆరుగురిని సస్పెండ్‌ చేసింది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌ (విజయవాడ), ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (రాజమండ్రి), సాయిప్రతాప్‌ (రాజంపేట), హర్షకుమార్‌ (అమలాపురం), రాయపాటి సాంబశివరావు (గుంటూరు), సబ్బం హరి (అనకాపల్లి)లపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్యలు తీసుకంది. గత వారం రోజులుగా ఈ ఆరుగురు లోకసభలో కూడా ఆందోళన చేస్తూ సభకు ఆటంకం కలిగిస్తున్నారు. వీరిని సభనుంచి సైతం సస్పెండ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో ఆరుగురిపై చర్యలు తీసుకోవడం వల్ల మిగతా సీమాంధ్ర ఎంపీలను దారిలోకి తెచ్చుకోచ్చనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఆరుగురు సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌పై ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్షకుమార్‌, సబ్బం హరి, సాయిప్రతాప్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ మరో వ్యూహానికి తెర తీసింది. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీమాంధ్ర ఎంపీలపై వేటు వేసింది. ఆంధప్రదేశ్‌ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదించటంతో యూపీఏ సర్కార్‌పై కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్ర ఎంపీలు ఆరుగురు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్నే సాకుగా చూపించి ఇప్పుడు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఒకవేళ లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు వీళ్లు తమ ఎంపీలు కారని, వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని చెప్పుకోడానికి వీలుంటుందన్నది కాంగ్రెస్‌ పార్టీ పెద్దల వ్యూహంలా కనిపిస్తోంది.సస్పెన్షన్‌పై లగడపాటి స్పందిస్తూ.. తమపై కాంగ్రెస్‌ వేటు వేస్తే.. ప్రజలు వారిపై వేటు వేస్తారని వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌పై లగడపాటి స్పందిస్తూ.. తమపై కాంగ్రెస్‌ వేటు వేస్తే.. ప్రజలు వారిపై వేటు వేస్తారని వ్యాఖ్యానించారు. అన్నింటికీ సిద్ధపడే సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామని రాజగోపాల్‌ అన్నారు. జంతర్‌ మంతర్‌ వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస చేపట్టిన ధర్నాకు లగడపాటి సంఘీబావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమపై సస్పెన్షన్‌ వేటు వేసినా.. తమ పోరాటంలో సడలింపు ఉండదని స్పష్టం చేశారు. అప్రజాస్వామిక పద్దతిలో విభజన బిల్లును పార్లమెంట్‌లో ఎలా ప్రవేశ పెడతారని లగడపాటి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. అన్నింటికీ సిద్ధపడే అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం చేసినట్లు చెప్పారు. తాము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా కాదని, పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాత్రమేనని వివరించారు. ఈ సస్పెన్షన్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలకు బహుమతిగా భావిస్తున్నానని, ఈనెల 21 తర్వాత తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని రాయపాటి స్పష్టం చేశారు. పార్లమెంటులో నిరసన తెలుపుతామన్న కేంద్రమంత్రుల్ని అధిష్టానం ఏం చేస్తుందని ఎంపీ హర్షకుమార్‌ ప్రశ్నించారు. అవిశ్వాసం ఎప్పుడో ఇస్తే ఇప్పుడు సస్పెండ్‌ చేయడమేంటన్న ఆయన అధిష్ఠాన నిర్ణయం దొంగలు పడ్డ ఆర్నెల్లకు.. అన్న సామెతను గుర్తుచేస్తోందన్నారు. అధిష్ఠానం, సోనియాను తప్పుదోవ పట్టించిన చిదంబరం, జైరాం రమేశ్‌లు రాజీనామా చేయాలని హర్షకుమార్‌ అన్నారు.జీవితకాలం అనుబంధం ఉన్న తమను బహిష్కరించి కాంగ్రెస్‌ తప్పు చేసిందని ఎంపీ సాయిప్రతాప్‌ అన్నారు. తమను బహిష్కరించినవారు మట్టిలో కలిసిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకొనేందుకు తమను సస్పెండ్‌ చేశారని ఎంపీ సబ్బం హరి అన్నారు. ఈ నెల 21 తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ బీఫారం ఇస్తామన్నా తీసుకునేవారు ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. 24 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతోందని, తాము ఆరుగురే కాదని, మిగతా ఎంపీలు తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సబ్బం హరి అన్నారు. పార్టీ సంకెళ్లు తెంచుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు. బహిష్కరించడం ద్వారా బిల్లును అడ్డుకుని, వ్యతిరేకంగా ఓటేసే స్వేచ్ఛ కల్పించి కాంగ్రెస్‌ తమకు మేలు చేసిందన్నారు. వచ్చే 15 రోజుల్లో బిల్లు పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడమే ఇప్పుడు తమ లక్ష్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *