
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) :
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె మంగళవారం రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. సమ్మె కారణంగా బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏటిఎంలలో డబ్బులు అయిపోయాయి. అన్ని ప్రధాన నగరాలలో విధులు బహిష్కరించి ఉద్యోగులు బ్యాంకుల ఎదుట ధర్నా నిర్వహించారు. రెండురోజుల సమ్మె కారణంగా బ్యాంక్ లావాదేవీలు స్తంభించిడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. యూపీఏ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నినాదాలు చేస్తున్నారు. యునైటెడ్ ఫోరం ఆధ్వరంలో జరుగుతున్న సమ్మెలో 67 శాఖలు పాల్గొన్నాయి. 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ.. 10వ వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను అడుగుతున్నామన్నారు. తాము ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం చర్చలు కూడా జరపడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను పెంచడం లేదని, తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని వాపోతున్నారు. బ్యాంకులు ఆర్జించిన లాభాలను బడా పారిశ్రామిక వేత్తల రుణ మాఫీకి ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము బ్యాంకులకు ఊడిగం చేస్తున్నప్పటికీ.. డబ్బులన్నీ ఉద్యోగులకే ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెబుతున్నారని, ఇంతగా అబద్ధాలు చెబుతున్న ఆయనకు అంతర్జాతీయ అబద్దాల కోరుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేయడం సరైందేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. మొత్తం 25 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 18 ప్రైవేటు బ్యాంకు సిబ్బంది మొత్తం 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. నవంబర్ 2012 నుంచి వీరికి వేతన సవరణ జరగాలి. కాని ఇప్పటి వరకు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 27 శాతం వేతనాలు పెంచారు. ప్రతి ఐదు, పది సంవత్సరాలకు వేతన సవరణ ఉంటుంది. బ్యాంకు ఉద్యోగు వేతన సవరణల విషయంలో ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ చర్చలు జరిపింది. మొదట 9.5 శాతం వేతనం పెంచుతామని చెప్పారు. తరువాత 0.5 శాతం అంటే పది శాతం పెంచుతామని చెప్పారు. దీనికి బ్యాంకు ఉద్యోగులు ఒప్పుకోలేదు. 2013 డిసెంబర్ 18వ తేదీన బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఫిబ్రవరిలో సమ్మె చేస్తామని ఆనాడే చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు అందరూ సహకరించాలి. వీరికి వేతనాలు పెంచడం వల్ల ఏడాదికి పది వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మరోవైపు ప్రైవేటీకరణ చేయవద్దని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటిగా ఉన్నాయి.
రెండో రోజూ బ్యాంకర్ల సమ్మె విజయవంతం




