జంపన్నవాగు జనసంద్రం
ఆదివాసీల జాతరకు పోటెత్తిన భక్తజనం
వరంగల్, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
ఆదివాసీల దేవత మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు దక్షిణ భారత దేశం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారానికి వచ్చే అన్ని దారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దారిపొడుగునా తీవ్రంగా ట్రాఫిక్ జామ్‌లతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా తల్లుల దర్శనానికి ఉత్సాహంతో ముందడుగు వేశారు. బుధవారం పూజారులు సమ్మక్క కూతురు సారలమ్మను గద్దెపై ప్రతిష్టించారు. దీంతో భక్తుల రాక పెరుగుతోంది. కన్నెపల్లి నుంచి జంపన్నవాగు మీదుగా సారలమ్మను ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సమ్మక్క సారలమ్మ గ్దదెల ప్రాంగణానికి రాకమునుపే అక్కడ ముగ్గులతో ముస్తాబు చేయడం జరుగుతుంది. అలాగే సారలమ్మ, సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గ్దదెలకు రాక సమయంలో, తిరిగి వెళ్లే సమయంలో అక్కడి పూజారులకు ఈ రక్షణగా నిలవడానికి మేడారం గ్రామ యువకులు సంసిద్ధంగా ఉంటారు. ఇలా 120 కుటుంబాల నుంచి కనీసం 70 నుంచి 100 మంది వరకు యువకులు ఈ ఘట్టాల్లో పాల్గొంటారు. సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగే ప్రతీ ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. మేడారం గ్రామంలో ఉన్న సుమారు 120 కుటుంబాల్లో ఒక్కో ఇంటినుంచి ఒక్కొక్క పెద్ద వయసువారు, ఒక్కో యువకుడు ఈ ఘట్టంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా యువకులు ఈ ఘట్టాలకు పూర్తిస్థాయి రక్షకులుగా ఉంటారు. ముగ్గులు గ్దదెల ప్రాంగణంలో జరిగే ఘట్టంలో తల్లులు, పగిడిద్దరాజు, గోవిందరాజులు రాక సమయంలో పూజారులు యువకులనే వ్యక్తిగత రక్షకులుగా నియమించుకుంటారు. ఈ కార్యకలాపాల్లో ఈ కుటుంబీకులు పోలీసుల సహాయాన్ని అర్థించరు. తమ దేవుళ్లకు తామే భద్రతగా ఉండేందుకే గ్రామ యువకులు ఆసక్తి చూపడం, అమలు చూపడం ఆనవాయితీగా వస్తోంది.ముఖ్యంగా సారలమ్మ, సమ్మక్క గ్దదెల మీదకు వచ్చేటప్పుడు, తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లేటప్పుడు భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. సుమారు లక్షలాది మంది భక్తులు మూకుమ్మడిగా ఆ దేవతల ఆశీర్వాదాలు పొందడానికి, తనివితీరా ఆ తల్లుల్ని తాకడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అయితే సమ్మక్కను చిలుకలగుట్టనుంచి తీసుకువచ్చేటప్పుడు, సారలమ్మను కన్నేపల్లి నుంచి తీసుకొచ్చేటప్పుడు భక్తులు తాకకూడదని వీరి ఆచారం. భక్తులెవరూ తల్లుల్ని తాకకుండా ఈ గ్రామ యువకులు.. పూజారులకు వలయాకారంలో భద్రతగా ఏర్పాటవుతారు. విధులు నిర్వహించడంలో ఇక్కడి యువత కచ్చితంగా ఉంటారు. ఆ పనిని చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. పెద్ద వయసువారు మాత్రం ఈ ఘట్టాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. పోలీసులు భారీగా మోహరించి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు.
జన జాతర





