
న్యూఢిల్లీ : లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల చర్య క్షమించరాని నేరమని, ఇదొక దుర్ఘటన అని స్పీకర్ మీరాకుమార్ అభివర్ణించారు. సీమాంధ్ర ఎంపీలు సభలో చేసిన దౌర్జన్యం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని స్పీకర్ అన్నారు. ఎంపీల చర్యపై సభ సిగ్గుపడుతుందని తెలిపారు. ఇది అత్యంత హేయమైన చర్య అని, దీన్ని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు ఆమె అన్నారు. ప్రపంచం మొత్తం భారత పార్లమెంటును గౌరవిస్తుంది.. ఇవాళ్టి ఘటన మన దేశ ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా ఉందని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు.లోక్‌సభలో జరిగినది హేయమైన ఘటన అని, తమనెంతో సిగ్గుపడేలా చేసిందనిఅన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ప్రజాస్వామ్యాన్ని ఎంతో గౌరవిస్తారని, అలాంటిది నేడు చోటుచేసుకున్న సంఘటనలు తమను సిగ్గుపడేలా చేశాయని ఆమె అన్నారు. జరిగిన సంఘటనలపై తదుపరి చర్యలకు చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో జరిగిన పరిణామాలపై ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ సభలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని, ఇప్పుడు బిల్లు వ్యవ హారాన్ని పార్లమెంటు చూసుకుంటుందని షిండే చెప్పారు. దోషులపై తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. లోక్‌సభ సమావేశంలో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరుపై బీజేపీ అగ్రనేత అద్వానీ తీవ్రంగా స్పందించారు. ఇటువంటి ఘటన తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇలాంటి ఘటనలు పార్లమెంట్ వ్యవస్థకే అవమానం అన్నారు. నేడు సభలో దౌర్జన్యం చేసిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే వదలి ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని కళంకం తీసుకువచ్చిన రౌడీ ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని జేడీయూ నేత శరద్‌యాదవ్ డిమాండ్ చేశారు. స్పీకర్, ప్రధాని తమాషా చూశారని ఆయన విమర్శించారు. లోక్‌సభలో మర్యాద మంటకలిసిందని మండిపడ్డారు. తెలంగాణ వ్యవహారాన్ని డీల్ చేయాల్సిన పద్ధతి ఇదికాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. తామంతా ప్రజలు ఎన్నుకుంటే వచ్చామని అంటూ ఇలాంటి ఘటనలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఆ అధికారం స్పీకర్‌కు ఉందన్నారు. లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరుకు నిశ్చేష్టులమయ్యామని ఎంపీ వివేక్ అన్నారు. పెప్పర్ స్ప్రే వల్ల అస్వస్థకు గురైన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. సభా సంప్రదాయాలను మంటగలుపుతూ సీమాంధ్ర ఎంపీలు సభలో దౌర్జన్యానికి దిగడం హేయమైన చర్యని పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. సభలో చర్చించకుండా దాడులకు దిగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా పార్లమెంట్లో చర్చిద్దామంటూ సూచించారు. పెప్పర్ స్ప్రే చేసి సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎంపీలపై దాడి ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. పార్లమెంట్‌ను బజారుస్థాయి ఘర్షణకు వేదికగా కాంగ్రెస్ మార్చిందని నామా విమర్శించారు. ఎంపీలను చంపేందుకు లగడపాటి రాజగోపాల్ కుట్ర పన్నారని మరో టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. మిరియాల పొడి స్ప్రే చేయడంతో సభలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. లగడపాటిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు : స్పీకర్ మీరాకుమార్




