మూజువాణితో తెలంగాణ
సర్కార్ నిర్ణయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లుకు లోక్‌సభలో బీజేపీ సహకరించకపోతే మూజువాణి ఓటు ద్వారా ఆమోదింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేసింది. తెలంగాణ బిల్లును బుధవారం లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రవేశపెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీలు రసాయన దాడికి దిగడం, వారి చర్యను బీజేపీ ఏమాత్రం తప్పుబట్టకుండా కాంగ్రెస్‌పైనే నెపం మోపడంతో బీజేపీపై కేంద్రం విశ్వాసం సన్నగిల్లినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రమేయం లేకుండానే వాయిస్ ఓట్ ద్వారా తెలంగాణ బిల్లు సభ విశ్వాసం పొందేలా కేంద్రం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు సోమవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కన్నా ముందే లోక్‌సభలో ఆమోదం పొందేలా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఓటాన్అకౌంట్ ఆమోదించిన తర్వాత తెలంగాణ బిల్లుకు ఇబ్బందులెదురవుతుందన్న భావనతో సోమవారం సభ ప్రారంభకాగానే చర్చకు పెట్టి వెంటనే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదించాలని, అనంతరం ఓటాన్అకౌంట్పై చర్చ ప్రారంభించాలని హోంమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవంగా గురువారం చివరిసారిగా లోక్‌సభ మూడు గంటలకు సమావేశమైన సందర్భంలోనే మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును ఆమోదం పొందించాలని కేంద్రం అనుకున్నా.. కొన్ని అనివార్య పరిస్థితుల్లో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. బీజేపీ మద్దతుపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో బిల్లును గట్టెక్కించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్న కేంద్రం.. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకొని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ బిల్లు విషయంలో యూపీఏ ప్రభుత్వం స్పష్టమైన సమాచారంతో ముందుకు పోలేదు. కేబినెట్లో సైతం టేబుల్ ఐటమ్‌గా తీసుకొని కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ నెల 18వ తేదీన తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చను ప్రారంభిస్తామని బయటకు చెబుతున్నా.. సోమవారం ఓటాన్ అకౌంట్‌కు ముందే మూజువాణి ఓటుతో దీన్ని ఆమోదింపజేసుకొని మమ అనిపించాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సభలో అలజడి సృష్టించే సీమాంధ్ర ప్రాంత ఎంపీలను ఇప్పటికే సస్పెండ్ చేశారు. వారు సోమవారం సభకు హాజరయ్యే అవకాశాలు లేవు. ఇంకా కొందరు కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్న కేంద్రందాన్ని అవకాశంగా తీసుకొని సభ తేరుకోలాగానే మూజువాణి ఓటుతో ఆమోదింపజేయాలని కాంగ్రెస్ వ్యూహరచనలో నిమగ్నమైంది. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ చేసిన ప్రకటన కాంగ్రెస్‌లో కొత్తఉత్సాహాన్ని నింపినట్లు తెలిసింది. పార్లమెంట్లో ఓటింగ్‌కు బీజేపీ పట్టుబట్టే అవకాశాలు లేవని, కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఒకవేళ ఇతర పక్షాలు డిమాండ్ చేసిన బీజేపీ ఓటింగ్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా ఓటింగ్ చేయబోదని కూడా కాంగ్రెస్ నమ్ముతోంది. బిల్లు ఆమోదంపై ఇష్టంలేకపోతే బీజేపీ వాకౌట్ చేసే అవకాశాలు ఉంటాయి తప్ప వ్యతిరేక ఓటు వేయదని, కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పరిణామాలను గమనించిన కాంగ్రెస్ బిల్లు పార్లమెంట్లో సులువుగానే ఆమోదం పొందుతుందనే భావనతో ఉంది. సోమవారం లోక్‌సభలో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఓటాన్అకౌంట్ ఆమోదం పొందగానే రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏదేమైనా తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దితోనే ముందుకు వెళుతుంది. బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఎలాగైనా ఈ నెల 21న పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు రాష్ట్ర విభజన చట్టబద్దం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
భాజపా సహకరించకపోతే





