Wednesday, 4 November 2026

మోడీ గొంతులో బాబు పలుకులు


అన్నదమ్ముల మధ్య విషం నింపారు
తెలంగాణను విశ్వాసంలో తీసుకున్నారు.. ఆంధ్రను విస్మరించారు
మోడీ కొత్త పల్లవి
సుజనాపూర్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నోటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు బయటకు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అన్నదమ్ముల్లాంటి తెలుగువాళ్ల మధ్య విషం నింపారని మోడీ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణను విశ్వాసంలోకి తీసుకున్న కేంద్రం ఆంధ్రను మాత్రం విస్మరించిందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. సుజనాపూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ప్రజల నుద్దేశించి మోడీ ప్రసంగించారు. పెరిగిన ధరలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నియంత్రించలేకపోయింది.. ధరలు తగ్గిస్తామంటూ చేసిన వాగ్దానాన్ని విస్మరించింది. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్‌కు ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని గుజరాత్‌ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ అంటే వాజపేయికి ఎంతో ఇష్టం. యాపిల్‌ రైతులను ఆదుకోవడంలో వాజపేయి ఆదర్శంగా నిలిచారు. హిమాచల్‌ ప్రదేశ్‌ వీరుల భూమి అన్నారు. దేశ సేవలో హిమాచల్‌ యువత పాత్ర ఆమోఘమైనది. బిజెపి పాలనలోనే ప్రజలు అభివృద్ధి చెందారు. మరోసారి అవకాశం ఇస్తే మరోసారి అభివృద్ధి చేసి చూపుతామని నరేంద్రమోడీ అన్నారు. యూపీఏ-1, 2 పాలనలో లక్షల కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణాలు జరిగాయన్నారు. ప్రజా సంపదను దోచుకున్నారు. ప్రజలను నిలువునా మోసం చేశారు. రానున్న ఎన్నికల్లో వారే తగిన గుణపాఠం చెబుతారు. జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను బీజేపీ ఏర్పాటు చేసినప్పుడు అందరూ స్వీట్లు పంచుకున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అన్నదమ్ముల్లా ఉన్న వారి మధ్య చిచ్చు పెట్టింది. ఒకర్నొకరు తిట్టుకుంటుందే తమాషా చూస్తోంది. మరో 100 రోజుల్లో ఆ పార్టీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయం. తాను చేసిన తప్పులను తప్పు అని ఒప్పుకునే పరిస్థితిలో కూడా కాంగ్రెస్‌ పార్టీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి రాజకీయం అంటే వ్యాపారం.. రాజకీయం అంటే తమకు దేశసేవ.. కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మడంలేదు. అందరూ బిజెపికేసి చూస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధికారం చేపట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. అంతకుముందు నరేంద్రమోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఉదయం చంఢీఘర్‌ విమానాశ్రయంలో కలుసుకున్నారు. మోడీతో దాదాపు అరగంటపాటు బేటీ అయినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికలు, పొత్తు, సీట్ల పంపకం తదితర విషయాలపై నరేంద్రమోడీతో చంద్రబాబు మంతనాలు సాగించినట్టు తెలిసింది గడిచిన పదిహేను రోజుల్లో నరేంద్రమోడితో చంద్రబాబు భేటీ కావడం ఇది మూడోసారి అని సమాచారం. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరిగే వరకు తెలంగాణ బిల్లును నిలిపివేయాలంటూ మోడీని కోరినట్టు తెలిసింది. సోమవారం రాష్ట్ర విభజన బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుపుతామని హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటన నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు హుటాహుటిన బయలుదేరి మోడీతో భేటీ అయినట్లు తెలిసింది. ఇప్పటికే సీమాంధ్ర తెలుగుదేశం ప్రజాప్రతినిధులతో బిల్లు ఆపేందుకు ఎంపీలతో పార్లమెంట్‌లో ఎమ్మెల్యేలతో శాసనసభలో ఆందోళనలు చేయించిన విషయం విదితమే. ఎప్పటి నుండో తెలంగాణకు బేషరతుగా మద్దతు ఇస్తామన్న బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు మాట మార్చిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో ఎన్నికల పొత్తు షరతుల్లో భాగంగా రాష్ట్ర విభజన అడ్డుకోవాలని బీజేపీ ముందు బాబు షరతు పెట్టినట్లుగా వార్తలొచ్చాయి. సీమాంధ్ర తెలంగాణ ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి విభజన చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇరుప్రాంతాల ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడడం ఎలా సాధ్యమని కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే చంద్రబాబును ప్రశ్నించారు. విభజనపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎవరి మాట వినకుండా ముందుకు పోతోంది. విభజనపై ఓటింగ్‌ జరిపే పరిస్థితి వస్తే బీజేపీని వ్యతిరేకంగా ఓటు వేసేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, విభజనను ఆపేందుకే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ సీమాంధ్ర నేతలు ధీమాగా ఉన్నారు. అవసరమైతే సోమవారం లోక్‌సభలో చర్చ కొనసాగితే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ సమాచారం ముందే బయటకు పొక్కడంతో లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందకుండా చూసేందుకే చంద్రబాబు మోడీతో రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ఏదేమైనా చంద్రబాబు, మోడీతో విమానాశ్రయంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *