
సీమాంధ్రకు కూడా న్యాయం చేయమన్నాం : అద్వానీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
తాము తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమేనని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. సీమాంధ్రకు న్యాయం చేయాలనేదే తమ డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బిల్లులో సవరణ విషయంలో కేంద్ర మంత్రులు బీజేపీ ముఖ్య నాయకులతో సోమవారం సమావేశమయ్యారు. మంగళవారం నుంచి చర్చ జరగాల్సి ఉన్నందున సహకరించాలని జీవోఎం సభ్యులు షిండే, జైరాంరమేశ్‌లు కోరారు. అయితే తాము మౌలికంగా అనుకూలమని బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్పష్టం చేశారు. అలాగని సీమాంధ్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేయలేమన్నట్లు కాదన్నారు. రాష్ట్ర విభజనపై రెండు ప్రాంతాల ప్రజలకు సంతృప్తి కలగాలని అద్వానీ పేర్కొన్నారు. షిండే, జైరామ్ రమేశ్‌లతో జరిగిన భేటీలో ఎంపీల సస్పెన్షన్‌పై అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వారిని బయటకు పంపి ఎలా చర్చిస్తారని అన్టనలు తెలిసంది. ఇదిలావుంటే రాష్ట్ర విభజనపై షరతులు పెట్టిందని వస్తున్న వార్తలను బీజేపీ కొట్టి పడేసింది. ఈమేరకు ఆపార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై తామెలాంటి షరతులు పెట్టలేదని వివరించారు. తాము తెలంగాణకు అనుకూలమని తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉన్నామని పేర్కొన్నారు. ఉన్నదంతా కాంగ్రెస్‌తోనే అని వ్యాఖ్యానించారు. విభజనపై కాంగ్రెస్ స్టాండ్ క్లియర్‌గా లేదని దుయ్యబట్టారు. తాము తెలంగాణకు అనుకూలంగా ఉంటూనే సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నామని అన్నారు. ఇదే విసయాన్ని పదేపదే కాంగ్రెస్‌కు తెలిపామన్నారు. అయితే అధికార పార్టీ పార్లమెంట్‌లో సభను సజావుగా జరపలేక పోతోందని విమర్శించారు. విభజనపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అయితే సీమాంధ్రకు కూడా న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ఇదిలావుంటే సమస్య సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య లేదని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, కేందప్రభుత్వం మధ్య ఉందని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారం విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. తమతో చర్చించి ఒప్పుకొన్న ప్రతిపాదనలు ఏవీ బిల్లులో లేవన్నారు. తమ ప్రతిపాదనలను సవరణ రూపంలో తెస్తామంటున్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. హిమాచల్ ప్రదేశ్ తరహాలో సీమాంధ్రలో పన్ను మినహాయింపులు ఇవ్వాలని, సీమాంధ్ర కోల్పోతున్న ఆదాయం భర్తీపై సముచిత నిర్ణయం తీసుకోవాలని తాము సూచించినట్లు చెప్పారు. సీమాంధ్రకు అసంచిత నిధినుంచి 10 వేల కోట్లకు పైగా కేటాయించాలన్నారు. ఉత్తరాంధ్ర, సీమలో పరిశ్రమలకు పదేళ్లు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఏళ్లు 50 పన్ను మినహాయింపు ఇవ్వాలని వెంకయ్యనాయుడు సూచించారు. సభను సజావుగా జరిపే బాధ్యత ప్రభుత్వానిదేనని తాము స్పష్టం చేశామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇవన్నీ తాము చేసిన సూచనలని వీటిని న్యాయంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మేం తెలంగాణకు అనుకూలం




