Wednesday, 4 November 2026

నేడు సీఎం రాజీనామా?


హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వచ్చిన అనంతరం రాజీనామా చేస్తానని కిరణ్‌ ఇదివరకే తమతో చెప్పారని వారు తెలిపారు. అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతాననడం దురదృష్టకరమని, ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని కిరణ్‌ తమతో అన్నాడన్నారు. ఈ విషయమై మంత్రి పితాని సత్యనారాయణ సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టి చర్చ మొదలైన మరుక్షణమే చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయనున్నారని చెప్పారు. పార్లమెంటులో ఎంపి లగడపాటిపై జరిగిన దాడిని ఖండించారు. తెలుగుజాతి బాధపడేలా పరిస్థితులు ఉన్నాయని, చిన్న రాష్ట్రాలకు చెందిన ఎంపీలు లగడపాటిపై మూకుమ్మడి దాడికి పాల్పడడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం పెప్పర్‌ వాడారని అన్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా పుటేజీలను బహిరంగపర్చాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతృత్వంలో జరిపిన సమావేశంలో అందరూ నేతలు సీఎంను కొత్త పార్టీ పెట్టాలని ఏకవాక్య తీర్మానం చేశారని చెప్పారు. సీఎం పార్టీ పెడితే అందులో చేరి పనిచేస్తానని చెప్పారు. సీఎం కొత్త పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించగా.. ఇచ్చేవారు ఇస్తారని.. జగన్‌ పార్టీ పెడితే నిధులు ఎలా వచ్చాయో.. ఆయనకు అలాగే వస్తాయని అన్నారు. ఇతర పార్టీలకు వచ్చినట్టుగానే సీఎం పార్టీకి కూడా నిధులొస్తాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *