
24 గంటల్లో ప్లేట్ ఫిరాయించిన భాజపా
అడుగడుగునా ఆటంకాలు, మెలికలు
21 సవరణలు ప్రతిపాదించిన కమలనాథులు
అవి ఆమోదిస్తే మళ్లీ లోక్‌సభకు బిల్లు పంపాలి
డబుల్ గేమ్‌పై తెలంగాణ తమ్ముళ్ల గుస్సా
టీ బిల్లు పాస్ కావడం వారికిష్టం లేదు : కమల్‌నాథ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లుపై 24 గంటల వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ తన వైఖరి మార్చుకొంది. లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్ సందర్భంగా బేషరతుగా మద్దతిస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ గురువారం రాజ్యసభలో బిల్లుపై తాము ప్రతిపాదించే సవరణలకు ఆమోదం తెలిపితేనే బిల్లుకు మద్దతిస్తామంటూ కొర్రీలు పెట్టింది. పెద్దల సభ ముందుకు విభజన బిల్లు రాకుండా అడుగడుగునా అడ్డుతగిలింది. 21 సవరణలు ఆమోదించాలంటూ బీజేపీ పట్టుబట్టింది. రాజ్యసభ సవరణలను కనుక ఆమోదిస్తే బిల్లు మళ్లీ లోక్‌సభలోకి వెళ్లి ఆమోదం పొందాల్సి ఉండటంతో బీజేపీ కావాలనే సభలో డబుల్‌గేమ్‌కు తెరతీసినట్లు తెలుస్తోంది. ఆంధప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు పై చర్చ జరుగకుండానే రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. తెలంగాణ బిల్లు చర్చకు రావడంలేదని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ చెప్పారు. బిల్లుపై చర్చకు అనుమతించడంలేదని ఆయన తెలిపారు. బిల్లు వస్తుందని ముందుఏగా ప్రకటించినా ఎందుకనో ప్రభుత్వం దానిని వాయిదా వేసుకుంది. మరోవైపు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ముగ్గురు సీమాంధ్ర సభ్యులు వెల్ వద్ద ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. కేవీపీ, సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లో చాలాసేపు ఆందోళన చేశారు. నిజానికి లోక్‌సభలో ఆమోదం పొందిన విభజన బిల్లుపై రాజ్యసభలో ఇవాళ చర్చ జరపాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రతులను రాజ్యసభ సభ్యులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నం సభలో విభజన బిల్లుపై చర్చ జరుగుతుందని భావించారు. చర్చకు రెండు గంటల సమయం కూడా కేటాయించారు. సభ పలుమార్లు వాయిదాలు పడుతూ ఇతర బిల్లులను ఆమోదించారు. తెలంగాణ బిల్లు మాత్రం చర్చకు రాకుండానే డెప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో బిల్లుపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. బుధవారం టి బిల్లు ఆమోదం పొందుతుందని అనుకున్నా దీనిపై ఎలాంటి చర్చ జరగకుండానే గురువారానికి వాయిదా పడింది. బిజెపి ప్రతిపాదించిన సవరణలపై కేంద్రం ఎలాంటి నిర్ణయానికి రావడం లేదని తెలుస్తోంది. ఒకవేళ సవరణలను ప్రతిపాదిస్తే మాత్రం మళ్లీ బిల్లును లోక్ సభకు పంపించాల్సి ఉంటుందని, దీనితో ప్రధాన మంత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేస్తారని సమాచారం. బిల్లుపై మళ్లీ లోక్‌సభకు వెలితే కష్టమని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు తాము ప్రతిపాదించిన అంశాలపై క్లారిటీ రావాలని బిజెపి పట్టుబడుతుంది. ప్రధాన మంత్రితో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో షిండే, కమల్‌నాథ్, జైరాం రమేష్, అహ్మద్ పటేల్‌లు హాజరయ్యారు. బిజెపి మొత్తం 32 సవరణలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ప్రకటించాలని.. బిజెపి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు కేంద్ర మంత్రులు షిండే, జైరాం రమేష్ లు వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. లోక్‌సభలో తాము సూచించిన సవరణలపై ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పలేదని, కనీసం రాజ్యసభలో నైనా చెప్పాలని బిజెపి పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సమావేశాలు ముగిసిన తరువాత బిజెపి పేర్కొన్న డిమాండ్స్ కు కాంగ్రెస్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టంభనతో రాజ్యసభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనితో గురువారం టి బిల్లుపై చర్చ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ప్రధాని ప్యాకేజీపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కోసం కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోంది. లోక్ సభలో ఆమోదం పొందిన తరువాత రాజ్యసభకు టి బిల్లు చేరిన సంగతి తెలిసిందే.బిల్లును ఆమోదించుకోవడం కోసం కాంగ్రెస్ మంత్రులు బీజేపీ అగ్రనేతలతో భేటీలు జరిపారు. తరువాత ప్రధాన మంత్రితో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు భేటీ అయ్యారు. ఈ భేటీలలో బీజేపీ నాలుగు సవరణలు ముందు ఉంచినట్లు తెలుస్తోంది. భద్రాచలంలోని ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం. ,సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం, రాయల ప్రాంతానికి ట్యాక్స్ హాలిడే ఇవ్వడం, హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ రాజ్యాంగ సవరణలు చేయాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. లోక్‌సభలో కేంద్రం వ్యవహరించిన తీరుపట్ల బీజేపీ అప్రమత్తమమై ఈ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా తమ పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రతిష్టంభన తొలగకపోవడంతో రాజ్యసభలో టి బిల్లుపై ఎలాంటి చర్చ జరగలేదు. బిజెపి సూచించిన సవరణలు ప్రభుత్వం అంగీకరిస్తే మళ్లీ బిల్లును లోక్ సభకు పంపించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ప్రధాన మంత్రి అధికారికంగా ప్రకటన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధప్రదేశ్ పునర్ వ్యవ్థసీకరణ బిల్లు విషయంలో మంగళవారం లోక్‌సభలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించారని వస్తున్న విమర్శలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తోసిపుచ్చారు. సభలో బిల్లు నియమబద్ధంగానే పాస్ అయిందని చెప్పారు. ఫిబ్రవరి 13న బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు జరిగిన సంఘటనలు దురదృష్టకరమని, కానీ గురువారం అంతా నియమాల ప్రకారమే జరిగిందని తెలిపారు. దానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కమల్‌నాథ్ స్పష్టంచేశారు. పెద్దల సభలో కూడా టి బిల్లు ఆమోదం పొందుతుందని కమల్ నాథ్ స్పష్టం చేశారు. బిల్లుపై వచ్చే సవరణలపై చర్చిస్తామని, లోక్‌సభలో ఎలా ఆమోదం పొందిందో ఇక్కడ అదే విధంగా ఆమోదం పొందుతుందని కమల్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బిల్లుపై సవరణల పేరుతో బీజేపీ కొర్రీలు పెట్టడంపై కమల్‌నాథ్ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణ రావడం ఇష్టం లేదంటూ ఆరోపించారు.
నిన్న బేషరత్.. నేడు షరతులు




