Tuesday, 3 November 2026

చట్టసభల్లో చిల్లర వేషాలు


యూపీలో బట్టలిడిచేశారు
సీఎం రమేశ్‌ సెక్రటరీ జనరల్‌పై దాదాగిరీ
చర్యకు ఉపక్రమించిన డెప్యూటీ చైర్మన్‌
లెంపలేసుకొని క్షమాపణలు చెప్పిన రమేశ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన చట్టసభల సభ్యులు చిల్లర, వెకిలి వేషాలతో ఆ సభల పరువును నడిబజార్లో నిలిపారు. తెలంగాణ బిల్లును లోక్‌షభలో ప్రవేశపెట్టిన రోజు రాజ్యసభలో వీరంగం సృష్టించిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ బుధవారం అంతకంటే హీనంగా ప్రవర్తించాడు. ఏకంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌పైనే దాడికి యత్నించాడు. మరో వైపు ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్డీ సభ్యులు అసెంబ్లీ ప్రవేశద్వారం ఎదుట బట్టలు విప్పి నిరసన ప్రదర్శన చేపట్టారు. చెరకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ సభ్యులు సురేశ్‌శర్మ, వీర్‌పాల్‌ రాఠీ గవర్నర్‌ సభోకి వస్తుండగా ఇలాంటి చర్యకు దిగారు. అలాగే రాజ్యసభలో సీఎం రమేశ్‌ మొదట వీరంగం సృష్టించి డెప్యూటీ చైర్మన్‌ చర్యలకు ఉపక్రమించడంతో తప్పైందంటూ లెంపలేసుకున్నాడు.
లోక్‌సభలో లగడపాటి, మోదుగుల తదితరులు సృష్టించిన ఘటనలు మరచిపోకముందే బుధవారం అలాంటి ఘటనే మరోటి రాజ్యసభలో చోటుచేసుకుంది. రాజ్యసభలో టిడిపి సభ్యుడు సిఎం రమేశ్‌ హంగామా సృష్టించారు. రాజ్యసభలో సీమాంధ్ర టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ వీధిరౌడీలా ప్రవర్తించారు. సభకు తెలంగాణ బిల్లు వచ్చిందని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ షంషేర్‌ షరీఫ్‌ ప్రకటిస్తుండగా ఆయనపై సీఎం రమేష్‌ చేయిచేసుకున్నారు. అధికారి చేతిలోంచి ప్రతులను లాక్కునేందుకు ప్రయత్నించారు. రమేష్‌ తీరుపై డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్దుడని కూడా చూడకుండా దాడి చేయడంపై రాజ్యసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభకు చేరింది. దీనితో సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేపట్టారు. కార్యదర్శి శంషేర్‌ కుమార్‌ చేతిలో ఉన్న పత్రాలను లాక్కొనేందుకు సీఎం రమేష్‌ దాడిచేసినంత ప్రయత్నం చేశారు. అక్కడనే ఉన్న గుండు సుధారాణి ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీనికి చైర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు మళ్లీ మధ్యాహ్నాం 2గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్‌ ప్రకటించారు. అంతకుముందు ఉదయం ప్రారంభమైన సభలో సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేపట్టారు. వెల్‌ లోకి వెళ్లిన కేవీపీ, సుజనా చౌదరీ, సీఎం రమేష్‌ లు ప్లకార్డులను పట్టుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సేవ్‌ ఆంధప్రదేశ్‌ ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ టిడిపి ఎంపి సుజనా చౌదరి నినాదాలు చేశారు. పలుమార్లు స్పీకర్‌ చేసిన విజ్ఞప్తులను సభ్యులు పట్టించుకోలేదు. చివరకు మధ్యాహ్నాం 12గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సమావేశమైన సభలో ఆందోళనలు సద్దుమణగకపోవడంతో మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా వేశారు.రాజ్యసభ సెక్రటరీ జనరల్‌పై సీమాంధ్ర టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ చేసిన దాడిని తెలంగాణ టీడీపీ ఎంపీ గుండు సుధారాణి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సీఎం రమేష్‌ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ సంషేర్‌ షరీఫ్‌పై దాడి చేసి ఆయన చేతిలో ఉన్న తెలంగాణ బిల్లు ప్రతులను లాక్కున్నారు. ఈ క్రమంలో బిల్లు ప్రతులను లాక్కోకుండా ఉండేందుకు గుండు సుధారాణి సీఎం రమేష్‌ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. లోక్‌సభలో ముగ్గురు మహిళలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని సీఎం రమేష్‌ అన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… నిన్న పార్లమెంట్‌లో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. సోనియా, రాహుల్‌ సీమాంధ్రకు వెళ్లగలరా? అని ప్రశ్నించారు.
ఉద్దేశపూర్వకంగా చేయలేదు : సీఎం రమేష్‌
రాజ్యసభలో సెక్రటరీ జనరల్‌నుంచి భావోద్వేగంతోనే పేపర్లు లాక్కుకునేందుకు యత్నించినట్టు ఉద్దేశపూర్వకంగా చేయలేదని టిడిపి సీమాంధ్ర ఎంపీ సీఎం రమేష్‌ రాజ్యసభలో చెప్పారు. ఈ ఘటనపై ఆయన సభకు క్షమాపణ తెలిపారు. తాను అప్రయత్నంగా ఈ పని చేశానని అన్నారు. దీనికి డెప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సానుకూలంగానే స్పందించారు. ఉదయం జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసినందున ఎలాంటి చర్య తీసుకోవడం లేదన్నారు. ఇదిలావుంటే ఉదయం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. మంగళవారం లోక్‌ సభలో జరిగిన అమానుషాన్ని ప్రపంచం మొత్తం గమనించిందని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీలు దేశ పరువును గంగలో కలిపారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోనియా, రాహుల్‌ సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లగలరా అని ఓ బహిరంగ సభలో మోడీ ప్రశ్నించడం జరిగిందని.. కాని సుష్మాస్వరాజ్‌ సీమాంధ్రకు వెళ్లగలదని మోడీ చెప్పగలరా? అని సీఎం రమేష్‌ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *