
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
నల్గొండ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో ఏం ఫరక్ పడదని, ఆయన రాజీనామా చేసినంత మాత్రాన ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం నల్గొండలోని క్లాక్ టవర్ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సీపీఐ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. చంద్రబాబు, జగన్, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామనే పేరుతో సీమాంధ్ర ప్రజలను మోసగించారని నారాయణ ఆరోపించారు. తెలంగాణ బిల్లుకు ఇటు శాసనసభలోనూ, అటు పార్లమెంట్‌లోనూ సిపిఐ మద్దతునిచ్చిందని నారయణ గుర్తు చేశారు. సీఎం కిరణ్ తన శక్తి చాలా ఎక్కువగా ఊహించుకొని తెలంగాణను అడ్డుకుంటానని, చివరి బంతికి బౌల్డ్ చేస్తానంటూ అసంబద్ధంగా మాట్లాడి ప్రజల దృష్టిలో చులకనయ్యారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు పల్లా వెంకట్ రెడ్డి, మల్లె ఆదిరెడ్డి, రామకృష్ణ, ఉజ్జయిని యాదగిరిరావు, వి రత్నాకర్ రావు ప్రభృతులు పాల్గొన్నారు.
కిరణ్ రాజీనామాతో ఫరక్ పడదు




